శరణుఘోషతో మార్మోగిని శబరిగిరులు

వేకువజామునుంచే వేలాదిగా భక్తుల రాక

మధ్యవయస్కురాలైన మహిళను అడ్డుకున్న భక్తులు

వయసు 52 ఏళ్లని తేలడంతో శాంతించిన స్వాములు

తిరువనంతపురం,నవంబర్‌6(జ‌నంసాక్షి): కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయం అయ్యప్ప శరణుఘోషతో మార్మోగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు వేకువజాము 5గంటల నుంచి సన్నిధానం చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. ఉదయం పంబలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామి దర్శనానికి బయలుదేరారు. వరుసగా రెండోరోజు కూడా మహిళల ప్రవేశం లేకుండా భక్తులు జాగ్రత్త పడ్డారు. అయితే మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయంలో అత్యంత పవిత్రంగా భావించే 18 బంగారు మెట్ల వద్దకు ఓ మహిళ చేరుకుందని తెలియడంతో ఆలయ పరిసరాల్లో ఆందోళనలు వెల్లువెత్తాయి. అయితే సదరు మహిళను ఆందోళనకారులు మెట్ల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనతో ఘర్షణలు చెలరేగాయి. గొడవల్లో ఓ విూడియా సంస్థకు చెందిన కెమెరామెన్‌కు గాయాలయ్యాయి. పోలీసులు సదరు మహిళను లలితగా గుర్తించారు. ఆమె తన వయసు 50ఏళ్ల కంటే ఎక్కువ అని చెప్పినప్పటికీ ఆందోళనకారులు నమ్మలేదు. ఆమె అబద్ధం చెప్తున్నారని ఆరోపించారు. ఆమెను లోపలికి వెళ్లనీయకపోవడంతో అధికారులు పోలీసు క్యాంపుకు తరలించారు. తన వయసును నిర్దారించుకునేందుకు సదరు మహిళ పోలీసులకు ఆధార్‌ కార్డును చూపించారు. దీంతో ఆమె వయసు 52ఏళ్లు అని పోలీసులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ఆమెకు క్షమాపణలు చెప్పి తర్వాత గుడిలోకి వెళ్లడానికి అనుమతించారు. దీంతో కొద్దిసేపు శబరిమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ వైపు సేవ్‌ శబరిమల నినాదాలతో అయ్యప్ప సన్నిధానం మారుమోగుతుండగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో తమకు అయ్యప్ప దర్శనం చేయించాలని కోరుతూ ఆలయం వద్దకు అతివలు చేరుకుంటున్నారు . దీంతో ఆందోళనకారులు మహిళలను అడ్డుకోవడంతో భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ తోపులాటలో బీజూ అనే కెమెరామెన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని అస్పత్రికి తరలించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సన్నిధానం నుంచి పంబ, నీలక్కల్‌ ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 12 వరకు స్వామి దర్వనాల తరవాత ఆరగింపు కోసం విరామం ఇచ్చారు. రాత్రి పదివరకు దర్శనాలు కొనసాగుతాయి.