శరద్‌ పవార్‌ స్థాపించిన ఎన్సీపీపై ఆధిపత్య పోరు

ముంబై,సెప్టెంబర్‌22(జనంసాక్షి):రాజకీయ కురువృద్ధుడు శరద్‌ పవార్‌ స్థాపించిన ఎన్సీపీపై ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. పార్టీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌  నేతృత్వంలో పార్టీ చీలిన విషయం తెలిసిందే. రెండు వర్గాలుగా విడిపోయిన ఎన్సీపీ.. అసలైన పార్టీ తమదేనంటూ ప్రకటనలు చేసుకుంటున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇరు వర్గాలూ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అజిత్‌ వర్గంలోని 41 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ శరద్‌ నేతృత్వంలోని వర్గం స్పీకర్‌ను కోరింది. తాజాగా శరద్‌ వర్గంలోని ఎమ్మెల్యేలపై డిప్యూటీ సీఎం నేతృత్వంలోని ఎన్సీపీ చీలిక వర్గం ఫిర్యాదు చేసింది. వారిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయంలో పిటిషన్‌ దాఖలు చేసినట్లు సమాచారం. అందులో జయంత్‌ పాటిల్‌, జితేంద్ర అవధ్‌, రోహిత్‌ పవార్‌, రాజేశ్‌ తోప్‌, అనిల్‌ దేశ్‌ముఖ్‌, సందీప్‌ కే. శిర్‌సాగర్‌, మాన్‌సింగ్‌ నాయక్‌, ప్రజాక్తా టన్పూర్‌, రవీంద్ర భుసరా, బాలాసాహెబ్‌ పాటిల్‌ ఉన్నారు. కాగా, ఇరు వర్గాలు పార్టీలో ఎలాంటి చీలికలు లేవని ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ జాతీయ నాయకుడిగా అజిత్‌ పవార్‌ను ఆయన వర్గం ఎన్నుకోవడంపై ఇరు వర్గాల నాయకులు అక్టోబర్‌ 6న ప్రత్యక్షంగా హాజరుకావాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. జూలైలో పార్టీని చీల్చిన అజిత్‌ పవార్‌.. షిండే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో కలిసిన విషయం తెలిసిందే. వెంటనే ఆయన రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు.