శరవేగంగా చెరువుల పునరుద్దరణ పనులు
వచ్చే వానాకాలనికి సిద్దం చేసేలా ప్రయత్నాలు
కరీంనగర్,మార్చి30(జనంసాక్షి): /ూష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం జిల్లా అధికారుల చొరవతో టెండర్ల పక్రియ త్వరగా నడుస్తోంది. నాలుగో విడతలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 500 చెరువులకు
పరిపాలనా అనుమతులు లభిస్తే 416 చెరువులకు టెండర్లు పూర్తి చేశారు. వీటిలో ఇప్పటికే 83 పనులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రారంభించారు. మిగతా పనులన్నింటినీ త్వరలోనే ప్రారంభిస్తామని కరీంనగర్ సర్కిల్ నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. సకాలంలో పనులు పూర్తి చేసేందుకు యర్యలు తీసుకుంటామని అన్నారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదన్నారు. నాణ్యతాప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లను ముందే హెచ్చరిస్తున్నారు. మొదటి మూడు విడతల్లో పనులు చేపట్టిన అనేక చెరువులు వచ్చే వానా కాలం సీజన్ వరకు సిద్ధం చేస్తాం. వీటి ద్వారా జిల్లాలో పెద్ద మొత్తంలో ఆయకట్లు స్థిరీకరణ జరుగుతుందన్నారు. అనుమతులు సాధించిన అధికారులు నాలుగో విడతలోనూ పెద్ద మొత్తంలో చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నారు. చెరువుల పునరుద్ధరణకు ఇప్పటికే రూ.132.39 కోట్లు మంజూరు చేశారు. ఈ నెలలో మరిన్ని చెరువులకు పరిపాలనా అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో ఇప్పటి వరకు 83 చెరువుల్లో ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పనులను ప్రారంభించారు. మిగతా పనులను వారం పది రోజుల్లో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని నీటి పారుదల శాఖ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ వెంకట కృష్ణ స్పష్టం చేశారు. రూ.123.25 కోట్లతో మంజూరైన 15 మినీ ట్యాంకు బండ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే వానా కాలం సీజన్ వరకు మూడు విడతల్లోని అనేక చెరువులు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. చెరువుల సామర్థ్యం పెరిగితే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. వచ్చే వానా కాలం సీజన్‌లో మూడు విడతల్లో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ దాదాపుగా పూర్తవుతుందనే నమ్మకాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే వచ్చే ఏడాదిలో నుంచి ఇటు కాళేశ్వరం, అటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిని ఈ చెరువుల్లో నిలువ చేసుకునే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.