శశిథరూర్‌ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు

విచారణ 16వ తేదీకి వాయిదా

న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీని శివలింగంపై కూర్చున్న తేలుతో పోల్చిన కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌పై నేరపూరిత పరువునష్టం కేసు దాఖలైంది. పాటియాలా హౌస్‌ కోర్టు ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ మాటను మోదీ వినే పరిస్థితుల్లో లేరన్న అర్ధం వచ్చే రీతిలో శశిథరూర్‌ ఇటీవల బెంగళూరులో జరిగిన లిటరేచర్‌ ఫెస్టివల్‌లో వ్యాఖ్యాలు చేశారు. ‘మోదీ శివలింగంపై కూర్చున్న తేలు వంటివారు. చేత్తో తొలగించలేరు, చెప్పుతో కొట్టనూ లేరు’ అంటూ థరూర్‌ వ్యాఖ్యానించారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ఎ వ్యక్తి ఒక జర్నలిస్టుతో ఈ మాట అన్నట్టు ఆయన తెలిపారు. శశిథరూర్‌ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. శివభక్తుడిగా ప్రకటించుకున్న రాహుల్‌ గాంధీ ఇప్పుడు ఏం చెబుతారని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ నిలదీశారు. థరూర్‌పై చర్యలు తీసుకుని, జరిగిన దానికి రాహుల్‌ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. శశిథరూర్‌ కేవలం ప్రధానినే కాకుండా, కోట్లాది హిందువులను, శివుడిని అవమానించారని, కాంగ్రెస్‌ అన్ని హద్దులూ అతిక్రమించిందని మరో మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ విమర్శించారు.