శాండ్విచ్ ఆర్డర్ చేస్తే.. ఫుల్ క్యాష్ బ్యాగ్ పంపారు!
న్యూయార్క్: ఓ మహిళ శాండ్విచ్ ఆర్డర్ చేస్తే ఏకంగా క్యాష్ బ్యాగ్ ఇచ్చేశారు. ఆ మహిళా బ్యాగ్ తెరిస్తే నిండా నగదు ఉంది. పొరబాటు జరిగిందని తెలుసుకున్న ఆమె రెస్టారెంట్కు వచ్చి బ్యాగ్ను తిరిగి ఇచ్చేసింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది.
జనెల్లె జోన్స్ అనే ఆవిడ కారులో ఇంటికి వెళ్తూ స్వీట్ టీ, చికెన్ శాండ్విచ్ ఆర్డర్ చేశారు. రెస్టారెంట్ సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి ఓ బ్యాగ్ అందజేశారు. జోన్స్ బ్యాగ్ తెరవగా శాండ్విచ్ బదులుగా అందులో 2,631డాలర్లు అంటే భారత్ కరెన్సీలో 1, 61,349 రూపాయలు ఉన్నాయి. జోన్స్ ఈ విషయాన్ని వెంటనే తన భర్త మాథ్యూ జోన్స్కు చెప్పింది. భార్యాభర్తలు ఇద్దరూ కలసి రెస్టారెంట్కు వెళ్లి క్యాష్ బ్యాగ్ను తిరిగి ఇచ్చేశారు. రెస్టారెంట్ సిబ్బంది వారికి కృతజ్ఞతలు చెప్పారు. రెస్టారెంట్ మేనేజర్ తమకు ఐదు భోజనాలు ఫ్రీగా ఆఫర్ చేసినట్టు జనెల్లె జోన్స్ చెప్పారు.