శాంతించు గోదారమ్మ తల్లీ

శాంతి పూజలు చేసిన మంత్రి పువ్వాడ
క్రమంగా తగ్గుతున్న గోదావరి ఉధృతి

 

భద్రాచలం,జూలై16(జనం సాక్షి ): ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రూపం దాల్చింది. దీంతో రాములవారి పాదాల చెంత 70 అడుగుల ఎత్తులో ప్రవహహిస్తున్నది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో గోదావరి వరద తగ్గాలని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగ్రగోదావరి శాంతించాలని నది స్నానఘట్టాల వద్ద వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులతో కలిసి గోదారమ్మకు హారతులు ఇచ్చారు. కాగా, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం కొద్దిగా తగ్గింది. ఉదయం వరకు 71.20 అడుగులగా ఉన్న నీటిమట్టం ఉదయం 8 గంటలకు 90.70కు చేరింది. వరద ఉధృతి తగ్గడంతో ఎగువన ఉన్న ప్రాజెక్టుల గేట్లను అధికారులు మూసివేస్తున్నారు. దీంతో భద్రాచలానికి క్రమంగా నీటిప్రవాహం నెమ్మదిస్తున్నది. భద్రాచలంలో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. అయితే శుక్రవారంతో పోలిస్తే.. గోదావరి వరద కాస్త తగ్గుతోంది. గంటగంటకూ వరద ఉధృతి తగ్గుతుండటంతో.. ప్రస్తుతం 71.90 అడుగులకు చేరింది. వరద బాధితుల కోసం జిల్లాకు 10 ఎన్డీఆర్‌ఎఫ్‌, 5 ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్స్‌ ను తరలించారు. 95 ముంపు బాధిత గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం 77 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 20 వేల 922 మందిని.. సెంటర్లకు తరలించారు. భద్రాచలం టౌన్‌ తో పాటు చుట్ట పక్కల ప్రాంతాలు, ముంపు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. భద్రాచలం దగ్గర 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా గోదావరి నీటిమట్టం పెరిగిందని స్థానికులు తెలిపారు. వరద కంటిన్యూ అవుతుండడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్‌ గా ఉండాలని హెచ్చరించారు అధికారులు. భద్రాచలం నుంచి వెళ్లే అన్ని మార్గాలనూ గోదావరి చుట్టుముట్టింది. వరద ప్రభావంతో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు,
మణుగూరు, పినపాక మండలాల్లో వందకు పైగా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. భద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్యనున్న బ్రిడ్జ్‌ పై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పని చేయాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించాలన్నారు. లైఫ్‌ జాకెట్లతో పాటు ఇతర రక్షణ సామాగ్రిని భద్రాచలంకు అదనంగా తరలించాలన్నారు సీఎం కేసీఆర్‌.