శాంతి పరిమళాలు వెదజల్లిన నేల

భారతదేశం శాంతి పరిమళాలు వెదజల్లే పూలతోట వంటిది. ప్రపంచానికి ప్రశాంతతను ప్రబోధించడంలో భారతీయులే ముందుంటారు. శాంతి సామరస్యాల్ని చాటే వేదమంత్రాలు పూర్వీకుల నుంచి మనకు వారసత్వంగా వచ్చాయి. ప్రాతఃస్మరణీయమైన ఆ వేదఘోష అందరి హృదయాల్లోనూ మారుమోగు తుంటుంది. కామ క్రోధాల వంటి అరిషడ్వర్గాల నుంచి శమింపజేసేది శాంతం అని ‘అమర కోశం’ చెబుతుంది. సృష్టి మనుగడ కొనసాగాలంటే పంచభూతాల అనుగ్రహం కావాలి. వాటి ఆగ్రహం ప్రాణికోటికి ముప్పు తెస్తుంది. అందువల్ల పంచభూతాలూ శాంతించాలంటాయి యజుర్వేద మంత్రాలు. సూర్యచంద్రులు, ఇంద్రాది దేవతలు శాంతించాలని తైత్తిరీయోపరిషత్తు కోరుతుంది. విష్ణువు శాంతాకారుడై, ఆదిశేషుడి విూద శయనించి ఉంటాడని వ్యాసమహర్షి వర్ణించాడు.సహజంగానే భారతీయులు సున్నిత మనస్కులు. దేవతారాధన కోసం మొక్కల నుంచి పూలు తుంచాలన్నా బాధపడతారు.సత్వగుణ ప్రధానుడైన శ్రీరాముడు శాంతస్వరూపుడుగా వెలుగొందుతాడు. హిరణ్యకశిపుడి వధ కోసం ఉగ్రనరసింహ అవతారమెత్తిన విష్ణుమూర్తి- భక్తప్రహ్లాదుడి స్తోత్ర పఠనంతో తిరిగి శాంతరూపం ధరిస్తాడు.స్వార్థం శత్రుత్వాన్ని పెంచుతుంది. అంతా తమకే సొంతం కాదని అందరూ గుర్తించాలి. స్వార్థబుద్ధి పూర్తిగా నశిస్తేనే, మనుషుల మధ్య సోదరభావం పెరుగుతుంది. అప్పుడే శాంతి కపోతం విశ్వమంతటా స్వేచ్ఛగా విహరిస్తుంది!