శివకాశిలో పటాకులై పేలుతున్న బాల్యం
బడిలో ఉండాల్సిన వారు ప్రమాదపు పనుల్లో ..
మామూళ్లతో సరిపుచ్చుకుంటున్న అధికారులు
చోద్యం చూస్తున్న సర్కారు
చెన్నై, సెప్టెంబర్ 7 (జనంసాక్షి)
తమిళనాడులోని శివకాశిలో విస్తరింఇన బాణసంచా తయారీ కర్మాగారంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిం చడంలో అక్కడి సర్కార్ చేష్టలుడిగి చూస్తోందన్న విమర్శలు ఉన్నాయి. వందలాదిగా ఉన్న తయారీ కేంద్రాల్లో అత్యధికశాతం బాలలే పనిచేయడం చూడవచ్చు. ముక్కు పచ్చలారని పిల్లలతో ఇక్కడి యాజమాన్యాలు పనిచేయించుకుంటాయి. సాయంత్రం అయ్యేటప్పటికి ఇక్కడి కర్మాగారాలు వందలాది మంది పిల్లలు స్కూల్ డ్రెస్‌లలోనే కనిపిస్తుంటారు. మొదట్లో ఒకటి రెండు గంటలు మాత్రమే అని చెప్పి, క్రమంగా పిల్లలతో అహర్నిశలూ పని చేయించుకోవడం రివాజుగా మారింది. పనివారు దొరకడం సమస్యగా ఉందని అందుకే పనిలేని పిల్‌ల్లను చేర్చుకుంటున్నామని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఫలితంగా ఇక్కడ అనేక పాఠశాలల్లో మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థుల సంఖ్య సుమారు 45 శాతమని సర్వ శిక్షా అభియాన్ సంస్థ తెలియజేసింది. ఏమాత్రం వృత్తి నైపుణ్యం లేని పిల్లలతో పని చేయిస్తున్న తీరు చూస్తే, అక్కడ అగ్నిప్రమాదాలు జరగడంలో వింతేవిూ లేదనిపిస్తుంది. ఇక్కడ ఓ బాల కార్మికుడి ఆదాయం వారానికి వెయ్యి రూపాయలకు పైగా ఉంటోంది. కొన్ని కుటుంబాల్ని పిల్లలే పోషించడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. ఇటీవల పేలుడు సంభవించి సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. నలభై మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. మరో 150 మంది కర్మాగారంలో చిక్కుకుపోయి ఉన్నారు. ఆ ప్రమాదం జరిగే సమయానికి కర్మాగారంలో సుమారు 300 మంది పనిచేస్తున్నారు. చనిపోయినవారిలో 20 మందికి పైగా పిల్లలే ఉన్నారు.
ఇలాంటి మరణ వార్తలు దీపావళికి ముందు శివకాశి నుంచి ప్రతి ఏటా వినవస్తున్నవే. . ఇటువంటి కర్మాగారాల్లో తప్పనిసరిగా చేపట్టవలసిన భద్రతా చర్యల గురించి ప్రభుత్వం ప్రతి ఏటా గుర్తు చేస్తన్నా ప్రమాదాలు మాత్రం తప్పడం లేదు. ఈ ప్రమాదాల్లో ఎక్కువ మంది బాల కార్మికులే ఉండడం మరో విషాదకర కోణం.బాణసంచా తయారీలో ఉపయోగించే ముడిసరుకుల ధర రానురానూ ఆకాశానికి అంటుతుండడంతో చాలా కర్మాగారాలు పిల్లలతో పనిచేయించుకోవడం జరుగుతోంది.
ఇక్కడ ‘నీడ్స్’ అనే ప్రభుత్వేతర సేవా సంస్థ బాణసంచా కర్మాగారాల్లో బాలకార్మికులు పని చేయడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం సాగిస్తోంది. రెండేళ్లుగా పోరాడుతుండేసరికి యాజమాన్యాలు కొత్త కొత్త రూపాల్లో బాలలతో పని చేయించడం మొదలైంది. అసలు పనంతా కార్మికులే చేస్తుంటారు. కాగితాలు చుట్టడం, టపాకాయల్ని ఎండబెట్టడం వంటి పనుల్ని మాత్రమే పిల్లలకు అప్పజెబుతున్నాం అని యాజమాన్యాలు సమర్థించుకొంటుంటాయి.ఇందులో పలు కర్మాగారాలు ఇంటి ఆవరణలోనే పనిచేస్తుంటాయి. పిల్లలతో పేలుడు పదార్థాలను కలపడం వంటి పనులు కూడా చేయిస్తున్నట్టు- అనేక పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి, పోలీసుల దృష్టికి వచ్చినా పెద్దగా మార్పేవిూ ఉండడం లేదని ‘నీడ్స్’ సంస్థ తెలిపింది. శివకాశిలో టపాకాయలు తయారుచేసే వారికే కాదు, శివకాశిలో ఎవరు అడుగుపెట్టినా వాళ్ల ప్రాణాలకూ హావిూ లేదు.
పరిస్థితి అంత ప్రమాదకరంగా తయారవుతోందని స్థానికులు చెబుతున్నారు. మొత్తం విూద భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం వల్ల శివకాశిలో గత పదేళ్లలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బాణసంచా పరిశ్రమపై ప్రభుత్వానికి అదుపులేకపోవడం చివరికి పసిపిల్లల్ని కూడా బలితీసుకుంటోంది. ఏటా సంభవిస్తున్న మరణాలను చూసి ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకోవాల్సి
ఉంది. భద్రతా నిబంధనల్ని కఠినంగా అమలు చేయడంతో పాటు-, బాలకార్మికులతో పని చేయించుకోవడంపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సి ఉంది .శివకాశి అంతటా ఎక్కువగా అగ్గిపెట్టెలు, టపాకాయల తయారీ యూనిట్లే కనిపిస్తుంటాయి. మొత్తం విూద ఇక్కడ 680 పైచిలుకు యూనిట్లు సుమారు పన్నెండు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రెండున్నర లక్షల మంది ఈ పరిశ్రమ విూద ఆధారపడి బతుకుతున్నారు. ఇదివరకు దీపావళికి మాత్రమే పరిమితమైన బాణసంచా పేలుళ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ శుభాశుభ కార్యాలకు కూడా విస్తరించడంతో ఇక్కడ ఏడాది పొడుగునా అవిశ్రాంతంగా పనులుంటున్నాయి. దేశంలోనే అతి పురాతన బాణసంచా కేంద్రంగా పేరున్న శివకాశిలో ఏడాదికి 1500 కోట్ల రూపాయల విలువైన సుమారు 500 రకాల టపాకాయలు ఉత్పత్తి అవుతుంటాయి. దీపావళి సందర్భంగా మాత్రం ఇక్కడ కార్మికులు రాత్రింబగళ్లు అతి వేగంగా పనిచేస్తుంటారు. ఇక్కడి కర్మాగారాలను యాజమాన్యాలు గృహ పరిశ్రమలుగానే పిలుచుకుంటాయి. ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మాత్రం ఇక్కడ భ ద్రతా చర్యల పర్యవేక్షణకు కేవలం ఒక్క అధికారిని మాత్రమే నియమించింది. ఆయనే అగ్గిపెట్టెల కర్మాగారాలను కూడా పర్యవేక్షించాలి. ఒకే ఒక సహాయకుడితో రోజుకు ఏడెనిమిది కర్మాగారాలను మాత్రమే పర్యవేక్షించగలుగుతున్నానని, ఇక్కడ సిబ్బందిని పెంచాలని ఆయన మూడేళ్లుగా చేస్తున్న విన్నపాలు ప్రభుత్వానికి ఇంతవరకూ వినిపించకపోవడం దురదృష్టకరం. నీటిపారుదల సౌకర్యాలు సక్రమంగా లేనందువల్ల శివకాశిలో వ్యవసాయానికి ఆస్కారం లేకుండాపోయింది. దాంతో ఇక్కడ ప్రింటింగ్, అగ్గిపెట్టెల పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. క్రమంగా బాణసంచా కర్మాగారాలు విస్తరించాయి. ఇక్కడి పలు కర్మాగారాలకు చెన్నైలోనే కాక, చైనాలోనూ బ్రాంచీలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు.