శివరాజ్‌సింగ్‌, సింధియాలకు పరీక్ష

మధ్యప్రదేశ్‌లో నేడు 28 స్థానాల్లో ఉప ఎన్నికలు

భోపాల్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణలో దుబ్బాకతో పాటు మధ్యప్రదేశ్‌లో మూడో తేదీన 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగుతున్నాయి. కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు చెందిన 25 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చనిపోవడంతో 28 స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలందరికీ బిజెపి సీట్లు ఇచ్చింది. దీంతో ఈ సీట్లలో ఇప్పటి వరకు ఉన్న బిజెపి నేతలు అసంతృప్తిలో ఉన్నారు. తమకు కాకుండా కాంగ్రెస్‌ నుండి వచ్చిన వారికి టిక్కెట్లు ఎలా ఇస్తారని వీరు బిజెపి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆరు సీట్లలో బిజెపి నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ టిక్కెట్‌ పైనా లేదా సమాజ్‌వాది పార్టీ టిక్కెట్‌ పైనో పోటీ చేస్తున్నారు. కొన్ని చోట్ల అసంతృప్తికి గురైన బిజెపి నేతలు ఇండిపెండింట్‌గా పోటీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇప్పటివరకు ప్రత్యర్దులుగా ఉన్న సింధియా గ్రూపు ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయలేక స్థానిక బిజెపి నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. కొన్ని చోట్ల బిజెపి కార్యకర్తలు ఎటువంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గనకుండా మౌనంగా ఉండిపోయారు. పార్టీలో నెలకొన్న ఈ అసంతప్తులు సిఎం శివరాజ్‌సింగ్‌కు నిద్రపట్టనివ్వడం లేదు. 2018 ఎన్నికల్లోనూ పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్ల 50 సీట్లును ఓడిపోయారు. ఇప్పుడు కూడ పరిస్థితి అంతకన్నా భిన్నంగా లేదు. దీంతో తమ పార్టీ నేతలను, కార్యకర్తలను నయానో భయానో దారిలోకి తెచ్చుకునేందుకు బిజెపి అగ్రనాయకత్వం ప్రయత్నించింది. మనం అధికారంలో ఉంటేనే గౌరవం, లేకుంటే ఎవ్వరికీ గౌరవం దక్కదంటూ శివరాజ్‌సింగ్‌ పార్టీ నేతలను హెచ్చరించారు. మరోవైపు ఈ రాష్ట్రం నుండి కేంద్ర కేబినెట్‌లో ఉన్న నరేంద్రసింగ్‌ తోమర్‌ పార్లమంట్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో సిఎం శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ బిజెపి కేడర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ తన నియోజకవర్గం కింద ఉన్న స్థానాల్లో బిజెపి అభ్యర్ధులను గెలిపించలేకుంటే కేంద్రమంత్రి తోమర్‌ తన ముఖాన్ని ప్రధానమంత్రికి ఎలా చూపించగలడంటూ ప్రశ్నించారు. పార్టీలోనే అసంతృప్తులతో ఆందోళన చెందుతున్న బిజెపి అగ్రనాయకత్వం ఈ సీట్లలో గెలవకుంటే అధికారం పోతుందంటూ తన పార్టీ నేతలను భయపెట్టడడం ద్వారా లేదా సెంటిమెంట్‌ను రేపడం ద్వారా సీట్లను గెలవాలని చూస్తోంది. ఫలితం ఏమిటనేది నవంబర్‌ పదో తేదీన తేలనుంది.సింధియా గ్రూపు బిజెపిలో చేరిన తర్వాత 14 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఇంతమందికి మంత్రిపదవులు ఇవ్వడంపై బిజెపి సీనియర్‌ నేతల్లో చాలా అసంతృప్తి నెలకొంది. అంతకుముందు మంత్రులుగా చేసిన, ఇతర పదవుల్లో పనిచేసిన దాదాపు 12 మంది సీనియర్‌ నేతలు మంత్రిపదవుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరంతా కూడా సింధియా గ్రూపు పట్ల అసంతృప్తిగా ఉన్నారు. వీరందరూ కూడా ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు ఎటువంటి కృషి చేయడం లేదు. ఎన్నిక జరుగుతున్న 28 స్థానాల్లో దాదాపు 19 స్థానాల్లో బిజెపి అంతర్గత సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ స్థానాల్లో గెలవడం కష్టంగా మారింది. దీనికితోడు సింధియా గ్రూపు అభ్యర్ధులు సభలు, సమావేశాలు పెట్టినప్పుడు స్థానిక బిజెపి నేతలను కలుపుకోని వెళ్లడం లేదు. ఈ పరిస్థితి ఇమర్తి దేవి సభ సందర్భంగా బహిరంగంగానే బయటపడింది. ఆమె సభలో వేదికపైకి పాత కాంగ్రెస్‌ నేతలందర్నీ కూర్చొపెట్టారు. స్థానిక సీనియర్‌ బిజెపి నేతలను వేదిక ముందు వరసలో కూర్చొబెట్టారు. దీనిపై బిజెపి నేతలు బహిరంగంగానే విూడియా ముందుకు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేశారు.