శివరాత్రి ఉత్సవాలకు ప్రధాన ఆలయాల్లో పకడ్బందీ ఏర్పాట్లు
కరీంనగర్,ఫిబ్రవరి14(జనంసాక్షి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంతో పాటు జిల్లాలోని కాళేశ్వరం, ధర్మపురి తదితర ప్రాంతాల్లో శివరాత్రి వేడుకలకు సర్వం సిద్దంచేశారు. ప్రధానంగా వేములవాడ, కాళేశ్వరంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ రెండు ఆలయాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు వేములవాడలో రాజరాజేశ్వరస్వామివారికి ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులు ఉపవాసాలు ఉండి జాగరణ చేసి కోడెల మొక్కులు, తలాభారం పంపిణీ, తలనీలాలు సమర్పిస్తారు. యాత్రికులు అధిక సంఖ్యలో రానున్నందున లఘు దర్శనాన్ని అమలు చేయనున్నారు. ఈ నెల 16 నుంచి 18 వరకు జరిగే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లలో లోపాలు రాకుండా చూసుకోవాలని అధికారులకు జిల్లా జాయింట్ కెలక్టర్ పౌసుమి బసు ఆదేశాలు ఇచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 17న రాజరాజేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శివుడు ఉద్భవించిన కాలంలో స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలుగుతాయనేది భక్తుల నమ్మకం. ఆ రోజున భక్తులు ఉపవాసాలు ఉండి జాగరణతో స్వామివారిని దర్శించుకుంచుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం, తితిదే తరఫున స్వామివారికి ఉదయం 6గంటలకు పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం అర్ధరాత్రి 11.45కి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజను కనులపండువగా నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటలకు ఆలయ కల్యాణమండపంలో మహాలింగార్చన పూజ చేపడుతారు. 16 నుంచి 18 వరకు మూడు రోజు పాటు జరిగే మహా శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలనుంచే కాకుండా పక్క రాష్టాల్ర నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. దాదాపు 6 లక్షల మంది స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ఏర్పాట్లును ముమ్మరం చేసింది. పట్టణంలో తాత్కాలిక బస్టాండ్లు, పార్కింగ్ స్థలాలు, భారీకేడ్లు, చలువ పందిళ్లు, ధర్మగుండం, క్యూలైన్‌లు, విద్యుద్దీపాలు, ఇతర ఏర్పాట్లన్నీంటిపై జెసి పర్యవేక్షించారు. తాగునీటి ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఎక్కడా పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదిలావుంటే వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఉత్సవాల కమిటీ 14 మంది సభ్యులతో ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో జరిగే మహాశివరాత్రి జాతర, శ్రీరామనవమి, శివకల్యాణం, తదితర ఉత్సవాల నిర్వహణకు పునరుద్ధరణ కమిటీలో 14 మంది సభ్యులతో కూడిన జాబితా విడుదల చేశారు. ఈ కమిటీ మూడు నెలల పాటు పని చేస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. కమిటీలో వేములవాడ నియోజకవర్గానికి చెందిన పది మంది, సిరిసిల్ల నియోజకవర్గం నుంచి నలుగురికి అవకాశం లభించింది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 17న రాజరాజేశ్వరస్వామివారికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ఱరెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారని రాష్ట్ర ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉత్సవాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం ఉందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే కాళేశ్వరంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రికి త్రిలింగ క్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. త్రివేణి సంగమంగా పేరొందిన శైవక్షేత్రాన్ని విద్యుత్తు దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఉత్సవ కమిటీ సభ్యులు, దేవస్థానం అధికారులు కలిసి మహాశివరాత్రిని గతంలో లేని విధంగా ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆవరణలో చలువ పందిర్లు వేశారు. అదే విధంగా మండపం వద్ద శాశ్వత కల్యాణం దాతలకు ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. క్యూలైన్ ద్వారా పార్వతీ అమ్మ వారిని
దర్శించుకునే వీలు కల్పిస్తున్నారు. గర్భగుడిలో రెండు లింగాల చుట్టూ వెండి బారికేట్లు ఏర్పాటు చేశారు. కాళేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి రోజైన మంగళవారం కాలసర్పదోషాల పూజలను రద్దు చేసారు. శివరాత్రి భక్తుల రద్దీ దృష్ట్యా కాలసర్పదోష పూజలను ఒక్క రోజు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలు, తదితర పూజలు యధావిధిగా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.