శివరాత్రి ఉత్సవాలకు సిద్దమైన శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి,ఫిబ్రవరి21: శ్రీకాళహస్తీశ్వరాలయంలో కొలువుదీరిన వాయులింగేశ్వరుడు మహా శివరాత్రి ఉత్సవాలు ఈనెల 24వతేది నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు అనుగుణంగా ఆలయ అధికారులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో శివరాత్రి ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని చలువపందిళ్లు, మంచినీటి సరఫరాకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికితోడు స్వామి దర్శనానికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఇదిలావుంటే భక్తుల పాలిట భూకైలాసంగా విరాజిల్లే శ్రీకాళహస్తీశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలోపల, ఆవరణలో కళాకారులు తీర్చిదిద్దిన రంగవల్లులు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రధాన ఆలయం, గోపురాలకు చేసిన విద్యుద్దీపాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. జ్ఞానప్రసూనాంబిక అతిథిగృహ సవిూపంలోని దుకాణ సముదాయ గోడకు వేసిన చిత్రాలు అబ్బురమనిపిస్తున్నాయి. విభిన్నరకాల నృత్య భంగిమలున్న ఈ చిత్రాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. ఇక్కడే శ్రీ`కాళ`హస్తి క్షేత్ర విశిష్టతను ప్రతిబింబించే చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయంలోని పలు ప్రదేశాలను కూలీలు నీటితో శుభ్రం చేస్తున్నారు. రాతిస్తంభాలపై పడిన ధూళిని ప్రత్యేక యంత్రాలతో తొలగిస్తున్నారు. ఉత్సవాలకు వివిధప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ ప్రాంగణంలో అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం తదితరప్రాంతాలు అరటి, మామిడి ఆకుల తోరణాలతో ముస్తాబై, పండుగొచ్చిందా అన్నట్లుగా ముక్కంటి ఆలయ పరిసరప్రాంతాలు దర్శనమిస్తున్నాయి.