శివరాత్రి జాతర సందర్భంగా ఇద్దరు మృతి
ఖమ్మం గ్రామీణం: మండలంలోని తీర్థాల సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న జాతరలో ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో రొయ్యల సాయిప్రకాష్ (12), వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్ల గూడెంకు చెందిన తోట నవీన్‌కుమార్ (13)లు ఆకేరులో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రొయ్యలు సాయిప్రకాష్, అతని తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి సుభద్ర, చెల్లి రమ్య , తోట నవీన్‌కుమార్, అతని తండ్రి రమేష్, తల్లి రమాదేవి, తమ్ముడు అరవింద్, చెల్లి ఐశ్వర్యంలతో కలిసి తీర్థాలలోని బంధువుల ఇంటికి రెండు రోజుల కిందట వచ్చారు. పెద్దలందరూ దేవుని దర్శనానికి వెళ్లగా సాయిప్రకాష్, నవీన్ కుమార్‌లు ఆకేరుకు వెళ్లి స్నానం చేస్తూ మునిగిపోయారు. మునిగిపోతున్న వీరిరువురిని చూసిన కొంతమంది వారిని ఏరు నుంచి బయటకు తీసే లోపే మృతి చెందారు. తర్వాత కొద్ది సేపటికి విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆ ప్రాంతానికి చేరుకుని హృదయ విదారకంగా రోదించారు. మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.