శివసేన నిర్ణయంతో నష్టపోయేది బిజెపియే

లాభపడనున్నకాంగ్రెస్‌, ఎన్సీపీలు
ముంబై,జనవరి24(జ‌నంసాక్షి): శివసేన బిజెపితో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించడంతో ఇప్పటికప్పుడు బిజెపికి వచ్చే నష్టం లేకున్నా రానున్న కాలంలో దాని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. బిజెపి-శివసేనల మధ్య పొరపొచ్చాలు మోడీతోనే ప్రారంభం అయ్యాయని చెప్పవచ్చు. శివసేనకు చెందిన ఎంపి సురేశ్‌ ప్రభును ఏకంగా కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవడం, తరవాత అతడిని పూర్తిగా బిజెపిలో చేర్చుకుని రాజ్యసభ కేటాయించడం వంటి చర్యలు శివసేనకు మింగుడుపడడం లేదు. అలాగే నోట్ల రద్దు, జిఎస్టీ తదితర అంశాలను శివసేన వ్యతిరేకిస్తోంది. దీంతో ఇరుపార్టీ మధ్య అంతరం పెరుగుతూ వస్తోంది. ఈ దశలో  శివసేన బీజేపీకి గుడ్‌బై చెప్పింది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీచేయబోమని ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. భారతీయ జనతా పార్టీతో దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న బంధానికి రాంరాం చెప్పింది. హిందూ ఓట్లు చీలిపోకూడదన్న ఉద్దేశంతో ఇప్పటివరకు ఇతర రాష్టాల్ల్రో  పోటీ చేయని సేన.. భవిష్యత్‌లో అన్ని రాష్టాల్ల్రో ఎన్నికల బరిలో దిగనున్నట్లు పేర్కొంది. రాబోయే లోక్‌సభ, విధాన సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న తీర్మానాన్ని మంగళవారమిక్కడ జరిగిన శివసేన జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో ఎంపీ సంజయ్‌ రౌత్‌ ప్రవేశపెట్టగా.. ఏకగ్రీవంగా ఆమోదించారు. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో సేన కనీసం 25 సీట్లు గెలుచుకుంటుందని, అలాగే 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 150 స్థానాలు దక్కించుకుంటుందన్నారు .ఫలితాల గురించి ఆలోచించకుండా వచ్చే ఎన్నికల్లో అన్ని రాష్టాల్ల్రో పోటీ చేస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే ప్రకటించారు. మోదీ సర్కారు పాకిస్థాన్‌ అంశాన్ని ఎన్నికల్లోనూ ఉపయోగించుకుంటోందని విమర్శించారు. గోవులను చంపడం నేరమంటూ దాన్ని నిషేధించినప్పుడు..
అధికారం కోసం అబద్ధాలు చెప్పడం కూడా నేరమేనని, దాన్నీ ఆపాలని చెప్పారు. మోదీ నెతన్యాహూతో కలిసి గాలిపటాలు ఎగరేసేకంటే శ్రీనగర్‌ తీసుకెళ్లి జాతీయ జెండా ఎగరేస్తే బాగుండేదని థాకరే పేర్కొన్నారు. శివసేన పార్టీ అధ్యక్ష పదవి, ఇతర పదవులకు కూడా మంగళవారం అంతర్గత ఎన్నికలు నిర్వహించారు. ఉద్ధవ్‌ థాకరే మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు ఆదిత్య థాకరేకు ‘నేత’గా పదోన్నతి కల్పించారు. ప్రస్తుతం యువసేన బాధ్యతలు చూస్తున్న జూనియర్‌ థాకరేకు నేత ¬దా కల్పించడంతో పార్టీ కోర్‌ టీంలో సభ్యుడయ్యారు. అయితే ఈ పరిణామాలను మహారాష్ట్రలో ప్రజలు శివసేనను సీరియ్‌సగా తీసుకోవట్లేదని కాంగ్రెస్‌, ఎన్సీపీలు పేర్కొన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదన్న సేన.. మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఇప్పటికీ ఇంకా ఎందుకు కొనసాగుతోందని ప్రశ్నించాయి.  మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న నిర్ణయంతో శివసేనే నష్టపోతుందని బీజేపీ వ్యాఖ్యానించింది. అయితే శివసేన నష్టపోయేదేవిూ ఉండదు. ఎందుకంటే అది అధికారం నుంచి విపక్షానికి పడిపోయింది. ఏతావాతా నస్టపోయేది బిజెపియే. శివసేన అండతో హిందూ ఓట్లను బిజెపి పొందగలుగుతోంది. అద్వానీ లాంటి సీనియర్లు సైతం గతంలో శివసేనతో తగవుఉల వద్దని మోడీకి పరోక్షంగా సూచించారు. అయినా బిజెపి కావాలనే శివసేనను దూరం పెట్టే ప్రయత్నం చేస్తోంది. పొమ్మనలేకపొగ పెడుతోంది. ఇవన్నీ భరించలేకనే సేన ఇక తనదారి తాను చూసుకుంటోంది.ఈ పర్యవసానాలు పరోక్షంగా ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు సహకరించవచ్చు. అందుకే ఈ రెండు పార్టీలు శివసేన నిర్ణయంతో లోలోన ఆనందపడుతున్నాయి.