శుక్రవారం నుండి టోల్‌ చార్జీలు

lekki-toll-gate-1వాహనదారుల ఇరవై రోజుల లగ్జరీకి శుక్రవారంతో తెర పడుతోంది. శుక్రవారం అర్థరాత్రి దాటగానే ఎప్పటిలాగే జాతీయ రహదారులపై వాహనాలకు టోల్‌ చార్జీలు వసూలు చేయనున్నారు. పెద్ద నోట్ల రద్దుతో చిల్లర సమస్య తలెత్తి.. టోల్‌ గేట్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచి పోయి… ట్రాఫిక్‌ సంక్షోభం ఏర్పడటంతో నవంబరు 11 అర్థరాత్రి నుంచి టోల్‌ గేట్ల వద్ద చార్జీల వసూలును నిలిపేశారు. దాన్ని పొడిగించుకుంటూ వచ్చారు. టోల్‌గేట్ల వద్ద తగిన ఏర్పాట్లు చేసినట్లు ధ్రువీకరించుకున్న తర్వాత డిసెంబరు 2 అర్థరాత్రి నుంచి తిరిగి వసూళ్లు మొదలెడుతున్నారు. మళ్లీ చిల్లర సంక్షోభం ఏర్పడకుండా రెండు రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటిది డిసెంబరు 15 వరకు టోల్‌ గేట్ల వద్ద రద్దయిన 500 నోట్లను తీసుకుంటారు. రెండోది… అన్ని టోల్‌ కౌంటర్ల వద్ద ఎస్‌బీఐ కార్డు స్వైపింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేసింది. అంటే, స్వైపింగ్‌ ద్వారా కూడా చెల్లింపులు చేయొచ్చు. చెలామణిలో ఉన్న నగదుకు తోడు రెండు అదనపు సౌకర్యాలున్నందున ఇబ్బందులుండవని ప్రభుత్వం భావిస్తోంది.