శ్రీకాళహస్తిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు
శివరాత్రి దర్శనాలకు భారీగా ఏర్పాట్లు
శ్రీకాళహస్తి,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని వేకువజామున రెండు గంటలకే సర్వదర్శనం ప్రారంభించాలని ముక్కంటి ఆలయాధికారులు నిర్ణయించారు. వేకువజామున ఒంటి గంటలకు లింగోద్భవ దర్శన ఏర్పాట్లు చేయనున్నారు. భవుడి మహా శివరాత్రి ఉత్సవాలకు శ్రీకాళహస్తి సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఇప్పటికీ ప్రధాన ఆలయాన్ని ముచ్చటైన రంగవల్లులతో తీర్చిదిద్దారు. గోపురాలకు కొత్త రంగులద్దడంతో కళకళలాడుతున్నాయి. భక్తకన్నప్ప, రామసేతు వంతెనలపైనా, పట్టణవ్యాప్తంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. అరటిచెట్లు, మామిడాకుల పచ్చతోరణాలు, కాషాయరంగు జెండాలతో వీధులు దర్శనమిస్తున్నాయి. తరలి వచ్చే భక్తుల కోసం ఆలయంలో చలువపందిళ్లు ఏర్పాటు చేశారు. చతుర్మాడ వీధులు, సాంస్కృతిక కార్యక్రమాల వేదికైన ధూర్జటి కళాప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. సన్నిధివీధిలో ఏర్పాటు చేస్తున్న కైలాసం సెట్టింగ్ పనులు జోరందుకున్నాయి. రథాలు, నారద పుష్కరణిలోని తెప్పలను రంగులతో ముస్తాబు చేస్తున్నారు. ఉత్సవ ఏర్పాట్లు ఆలస్యం కావడంతో, ఇప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాల షెడ్యూలు ఖరారు కాలేదు. అయితే పలువురు పీఠాధిపతులు, సినీనటులు, గాయకులు, కళాకారులకు ఉత్సవాలకు రావాలని అధికారులు ఆహ్వానం పంపారు. సర్వజగత్తును పరిపాలించే.. సర్వ జగద్రక్షకుడైన సోమస్కంధమూర్తికి.. యాగరక్ష పెట్టాక పురవీధుల్లో ఊరేగింపునకు తీసుకెళ్లడం ఇక్కడి సంప్రదాయంగా వస్తోంది. బ్రహ్మోత్సవ రోజుల్లో ఉత్సవమూర్తులతో నిర్వహించే ఊరేగింపు మహోత్సవానికి ఎంతో ప్రాభవం ఉంటుంది. అందుకే సాధారణ రోజుల వలే కాకుండా.. బ్రహ్మోత్సవ రోజుల్లో.. దేవతామూర్తులు బయటకు వెళ్లాలంటే.. ఆలయంలోని యాగశాల వద్ద నిలిపి యాగరక్ష పెట్టాక మాత్రమే బయటకు తీసుకెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. ఆలయంలోని అలంకార మండపంలో ఉత్సవ అలంకరణలు పూర్తయిన శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత సోమస్కంధమూర్తి ఉత్సవమూర్తులను యాగశాల వద్ద యాగకలశాలకు రోజూ హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సిద్ధం చేసిన యాగరక్షను ఉత్సవర్లకు అద్దిన తరవాత.. వీళ్లను ఊరేగింపుగా తీసుకెళ్తుంటారు. ఈ విశేషోత్సవాన్ని సందర్శించేందుకు జనం అధిక సంఖ్యలో రావడం విశేషం. ఉత్సవాలను పురస్కరించుకుని గంగాభవానీ సమేత శివయ్య దశకంఠుడిపై పురవిహారం చేస్తాడు.