శ్రీనివాస్ గౌడ్ హత్య కేసు ఓ కుట్ర
అవినీతిపై తంటాలుపడుతున్న మంత్రి కుట్ర
పికె సలహాలతోనే ఇలాంటి కుట్ర కేసులు: డికె అరుణ
హైదరాబాద్,మార్చి3(జనం సాక్షి): మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కేసు ఓ కుట్ర అని..కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. పార్టీ కార్యాలయంలో విూడియాతో మాట్లాడిన ఆమె.. మంత్రి హత్య కుట్ర కేసు డ్రామాకు సీఎం కేసీఆరే మూలం అని అన్నారు. మొదటి ముద్దాయిగా కేసీఆర్ ను..రెండవ ముద్దాయిగా మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ను చేర్చాలన్నారు. కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. మంత్రి హత్యకు కుట్రపై పూర్తి స్థాయి విచారణ జరగాలన్నారు. నిందితుల ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఎఫ్‌ఐఆర్ లో అన్ని కట్టుకథలే పెట్టారన్నారు.
నిందితులను అరెస్ట్ చేశారా? కిడ్నాప్ చేశారా అనేది వాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పాలన్నారు. పోలీసుల అదుపులో ఉన్నవారంతా.. ఒకప్పుడు మంత్రి శ్రీనివాస్ రెడ్డి అనుచరులేనన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర.. ఒక బోగస్ అని డీకే అరుణ అన్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. శ్రీనివాస్ గౌడ్‌ను చంపాల్సిన అవసరం ఎవరకీ లేదన్నారు. తన అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి మంత్రి తంటాలు పడ్తున్నారని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతిపై పోరాడుతోన్న వారికి కచ్చితంగా షల్టర్ ఇస్తామని స్పష్టం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వెనుక… ప్రశాంత్ కిషోర్ కుట్ర ఉందని ఆరోపించారు. రాత్రి వేళ ఇంటిపై రాళ్ళు వేయటం కాదు.. దమ్ముంటే నాపై రాజకీయంగా పోరాడాలి. ఇది బెంగాల్ కాదు.. పీకే వ్యూహాలు తెలంగాణలో పనిచేయవు. నీకూ భార్య, పిల్లలున్నారని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. మహిళాగా కేసీఆర్ ప్రభుత్వ అరాచకాలపై పోరాడుతాను. పులిలా ఉండే పోలీస్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్ర.. పిల్లిలా మారటం బాధాకరం అని డీకే అరుణ వ్యాఖ్యలు చేశారు.