శ్రీలంకకు భారత్‌ మరో 500 మిలియన్‌ డాలర్ల సాయం

కొలంబో,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్‌ తన సాయాన్ని కొనసాగిస్తోంది. తాజాగా ఇంధన దిగుమతుల నిమిత్తం మరో 500 మిలియన్‌ డాలర్ల క్రెడిట్లైన్‌ అందించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సబ్రీ స్వయంగా ప్రకటించారు. విదేశీ మారక నిల్వలు పూర్తిగా తగ్గిపోవడంతో వివిధ నిత్యావసరాల దిగుమతుల్లో శ్రీలంక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఆ దేశ కరెన్సీ విలువ పూర్తిగా పతనమై ద్రవ్యోల్బణం కొండెక్కింది. ఈ పరిస్థితుల్లో ద్వీపదేశాన్ని ఆదుకునేందుకు భారత్‌ ఇప్పటికే పలుసార్లు క్రెడిట్లైన్‌ రూపంలో పెద్దమొత్తంలో రుణాన్ని మంజూరు చేసింది. అలాగే 1.5 బిలియన్‌ డాలర్లు విలువ చేసే దిగుమతుల చెల్లింపుల గడువును వాయిదా వేసేందుకు అంగీకరించింది. 400 మిలియన్‌ డాలర్ల కరెన్సీ బదిలీ కాలపరిమితిని సైతం పొడిగించింది. ప్రస్తుతం వాషింగ్టన్లో ఉన్న అలీ సబ్రీ అంతర్జాతీయ అత్యవసర నిధి (ఎఓఈ)తో బెయిల్‌ ఔట్‌ ప్యాకేజీపై చర్చలు జరుపుతున్నారు. దీనిపై ఇప్పటికే చర్చలు కొలిక్కి వచ్చాయని.. ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాల్లో ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని ఇటీవల తెలిపారు. మరోవైపు ప్రపంచ బ్యాంకుతో సహా చైనా, జపాన్తోనూ ఆయన ఆర్థిక సాయం నిమిత్తం చర్చలు జరుపుతున్నామన్నారు.రానున్న తొమ్మిది నెలలు చాలా క్లిష్టంగా గడవనున్నాయని సబ్రీ తెలిపారు. ఆ సమయంలోగా భారీ ఎత్తున పెట్టుబడులను అమెరికా డాలర్ల రూపంలో శ్రీలంక సెంట్రల్‌ బ్యాంకుకు చేర్చాల్సి ఉందని తెలిపారు. వివిధ దేశాలతో జరుపుతున్న చర్చలు ఫలించి కనీసం 2 బిలియన్‌ డాలర్ల నిధులను సమకూర్చుకోగలిగితే.. సంక్షోభాన్ని నివారించి శ్రీలంక రూపాయిని స్థిరపర్చేందుకు అవకాశం ఉంటుందన్నారు.