శ్రీలంకలో ఆగని ఆందోళనలు

దేశంలో ఎమెర్జన్సీ విధించిన ప్రభుత్వం
పలుచోట్ల కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు
తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ప్రధాని

కొలంబో,జూలై13(జనంసాక్షి: శ్రీలంకలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు ప్రధాని రణిల్‌ విక్రమసింఘే బుధవారం ప్రకటించారు. ఆందోళనకారులను అరెస్ట్‌ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. తానే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించనున్నట్టు వెల్లడిరచారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారనే వార్తలు వెలువడగానే దేశవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. పార్లమెంట్‌ ముట్టడికి జనాలు కదిలి వస్తుండడంతో ఎమర్జెన్సీ పరిస్థితిని విధిస్తున్నట్టు రణిల్‌ విక్రమసింఘే పేర్కొన్నారు. కొలంబో సహా పశ్చిమ ప్రావిన్స్‌లో నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆందోళనలను అదుపులోకి తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడిరచింది. కాగా మాల్దీవులకు పారిపోయిన గొటబాయ రాజపక్స తక్షణమే రాజీనామా చేయాలని శ్రీలంకవాసులు డిమాండ్‌ చేస్తూ రోడ్డెక్కారు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ప్రధాని కార్యాలయం ఆవరణ నుంచి వెళ్లిపోవాలని ఆందోళనకారులను భద్రతా బలగాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య తోపులాటలు జరిగాయి. సమూహాలను చెదరగొట్టేందుకు వాటర్‌ క్యానన్లు, బాష్పవాయు గోళాలను బలగాలు ప్రయోగించారు. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఈ క్రమంలో వేల సంఖ్యలో అక్కడి ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గొటబయకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొలంబోలోని అధ్యక్ష నివాసం వద్ద ఆందోళన సృష్టించారు. దీంతో ఆర్మీ సైతం రంగంలోకి దిగి… కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నిరసనకారులు లోనికి చొచ్చుకురావడంతో.. సైనికులు భాష్ప వాయువును ప్రయోగించారు. ఈ క్రమంలోనే నిరసనకారులు పోలీసుల వాహనాలపైకి రాళ్లు రువ్వగా.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. వేల సంఖ్యలో అక్కడి ప్రజలు రోడ్ల పైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజీనామా చేయకుండా అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. మిలిటరీ విమానంలో మాల్దీవులు చేరుకున్నారు. బుధవారం ఉదయం మాలే నగరంలోని వెలానా ఎయిర్‌పోర్టులో ఆయన ప్రత్యక్షమయ్యారు. గొటబాయతోపాటు ఆయన సతీమణి, ఇద్దరు బాడీగార్డులు వెంటవున్నారు. మాల్దీవుల ప్రభుత్వ ప్రతినిధులు గొటబాయకు స్వాగతం పలికారు. మాలేలోని ఎయిర్‌పోర్టులో దిగాక పోలీస్‌ ఎస్కార్ట్‌తో రహస్య ప్రాంతానికి తరలించారు. మంగళవారం రాత్రి కొలంబో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి అధ్యక్షుడు గొటబాయ ఇద్దరు బాడీ గార్డులతో మిలిటరీ విమానం బయలుదేరినట్టు ఆ దేశ రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి.