శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్యనాయుడు

అనంతరం స్వామివారి ప్రసాదాలు అందచేత
తిరుమల,ఫిబ్రవరి10(జనంసాక్షి): కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయానికి చేరుకున్న వెంకయ్యనాయుడికి.. మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు ఉపరాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఏడాదికి ఒక్కసారే స్వామివారిని దర్శించుకోవాలని, దీనివల్ల సామాన్య భక్తులకు శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభిస్తుందని ఆయన సూచించారు. తిరుమలకు ఎన్నిసార్లు వచ్చినా నిత్యనూతన ఉత్సాహం కలుగుతూ ఉంటుందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సాంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆలయంలో టీటీడీ ఏర్పాట్లు బాగున్నాయన్నారు.ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన మనవరాలి పెళ్లి కోసం తిరుపతికి వచ్చారు.