శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన టిటిడి

తిరుమల,మార్చి1(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టిటిడి శుక్రవారం విడుదల చేసింది. జూన్‌ నెలకు సంబంధించిన 63,804 ఆర్జిత సేవా టికెట్లను తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇందులో 10,129 సేవా టికెట్లను ఆన్‌లైన్‌ డిప్‌ విధానానికి కేటాయించారు. డిప్‌ పద్ధతిలో సుప్రభాత సేవకు 7,924, తోమాల సేవ 120, అర్చన 120, అష్టదళ పద్మారాధన సేవ 240, నిజ పాదదర్శనానికి 1,725 టికెట్లు కేటాయించారు.సాధారణ పద్ధతిలో 53,675 టికెట్లను కేటాయించారు. అందులో విశేష పూజకు వెయ్యి, కల్యాణోత్సవం 13,775, ఊంజల్‌ సేవ 4,350, వసంతోత్సవం 7,700, సహస్ర దీపాలంకరణ 18,600, ఆర్జిత బ్ర¬్మత్సవానికి 8,250 టికెట్లు అందుబాటులో ఉంచారు. డిప్‌ పద్ధతిలో ఉన్న టికెట్ల కోసం నమోదుకు నాలుగు రోజుల పాటు అవకాశం కల్పించారు. నమోదు చేసుకున్న వారికి డిప్‌ విధానం ద్వారా ఆర్జిత సేవా టికెట్లను కేటాయిస్తారు.

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రశాంత్‌ రెడ్డికి వేదపండితులు వేదశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని…ఇరు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే స్వామి వారిని ప్రార్ధించినట్లు ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు.