షమికి కోహ్లీ ప్రశంసలు
నేపియర్,జనవరి23 (జనంసాక్షి) : అత్యంత వేగంగా వన్డేల్లో వంద వికెట్ల ఘనత అందుకున్న పేసర్ మహ్మద్ షమిని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. అతడు ఇంతకుముందెన్నడూ లేనంత దారుఢ్యంతో కనిపిస్తున్నాడని వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో షమి 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అద్భుత ప్రదర్శనలు చేస్తున్న అతడు గతేడాది యోయో పరీక్ష విఫలమైన సంగతి తెలిసిందే. దాంతో పాటు గృహహింస కేసులతో మానసికంగా ఇబ్బంది పడ్డాడు. ప్రపంచంలోని ఏ జట్టునైనా కుప్పకూల్చగలమని బౌలింగ్ విభాగం విశ్వసిస్తోంది. తన సామర్థ్యం, ఫిట్‌నెస్‌పై షమికి ఎంతో నమ్మకముంది. అతడి కెరీర్‌లో ఇంతకు ముందెన్నడూ లేనంత దారుఢ్యంతో కనిపిస్తున్నాడు. టెస్టు ఫామ్ వన్డే క్రికెట్‌లోకి పనికొచ్చింది. ఈ మధ్యే ఆడిన మ్యాచుల్లో ఇది ఆకట్టుకున్న ప్రదర్శన. టాస్ ఓడినప్పుడు ప్రత్యర్థి స్కోరు 300 దాటుతుందని అనుకున్నా. ఇలాంటి వికెట్‌పై 157 పరుగులకే ఆలౌట్ చేయడం అద్భుతం. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ కాస్త మందకొడిగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం స్పిన్నర్లు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు. మైదానంలో పరుగులు చేయడం కష్టంగా మార్చారు. శిఖర్ లయ అందుకున్నాడంటే ప్రమాదకరంగా మారతాడు. సూర్యుడి వల్ల మ్యాచ్ ఆగినప్పుడు అతడికి మ్యాచ్ ముగించాలని చెప్పా’ అని కోహ్లీ అన్నాడు.