షరతుల్లేకుండా.. పిలిస్తేచాలు.. వచ్చేస్తాం..
– సమ్మె విరమణకు ఆర్టీసీ జేఏసీ సంసిద్ధత
– లేబర్ కోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో నిర్ణయం తీసుకున్నామని వెల్లడి
హైదరాబాద్,నవంబర్ 20(జనంసాక్షి):ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం ఆహ్వానిస్తే సమ్మె విరమించి విధుల్లో చేరుతామని, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం తీసుకుంది. కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నామని జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. బుధవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి, థామస్ రెడ్డి సహా 16 మంది జేఏసీ నేతలు హాజరయ్యారు. హైకోర్టు తీర్పు, సమ్మె కొనసాగింపుపై కీలక చర్చలు జరిపారు. భేటీ అనంతరం విూడియాతో మాట్లాడిన జేఏసీ నేతలు కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. లేబర్ కోర్డులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం, యాజమాన్యం కూడా ఈ తీర్పును గౌరవించాలని కోరారు. కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. భేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాని, కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని అశ్వత్థామరెడ్డి కోరారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం, యాజమాన్యం ఆ దిశగా సత్వరమే చర్య తీసుకుంటాయని ఆశిస్తున్నామని అన్నారు.సెప్టెంబర్ 4 ముందు ఉన్న పరిస్థితులు ఆర్టీసీలో ఉంటే వెంటనే తాము సమ్మెను విరమిస్తామని ప్రకటించారు. లేబర్ కోర్టుపై తమకు మ్మకం ఉందని, అందువల్ల హైకోర్టు సూచలన మేరకు విధుల్లో చేరడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. హైకోర్టు తీర్పు కాపీ తమకు బుధవారమే అందిందని…దాని పై చర్చించామని తెలిపారు. సమ్మెపై విచారణ చేపట్టాలని హైకోర్ట్ లేబర్ కోర్టుకు ట్రాన్సఫర్ చేసింది. ఈ సందర్భంగా కోర్ట్ తీర్పును తాము గౌరవిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల డిమాండ్లను అన్నీ లేబర్ కోర్ట్ అందజేసినట్లు చెప్పారు. లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందన్న అశ్వత్థామరెడ్డి…కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఎలాంటి షురతులు లేకుండా కార్మికుల్ని విదుల్లోకి తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. డ్యూటీ చాట్, అటెండెంట్ రిజిస్టర్‌పై మాత్రమే సంతకం పెడతామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం త్వరగా కార్మికుల్ని విధుల్లోకి ఆహ్వానిస్తే సమ్మె విరమించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. అప్పటి వరకు ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె కొనసాగుతున్నట్లు అశ్వత్థామరెడ్డి వివరించారు. ఆర్టీసీ కార్మికుల ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. కాగా, ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తే ఏం చేయాలన్న దానిపై సర్కారు కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కార్మికులను ఎట్లా డ్యూటీలో చేర్చుకోవాలె, ఏమేం కండిషన్లు పెట్టాలన్న దానిపై ఆలోచన చేస్తోందని.. లేబర్ కోర్టు విచారణ, తీర్పు ఎట్లా ఉంటుందన్నది అంచనా వేస్తోందని సమాచారం. లేబర్ కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా అన్న దానిపై తర్జనభర్జన జరుగుతున్నట్టు తెలుస్తోంది. కార్మికులు సమ్మెకు వెళ్లడంపై ఇప్పటికీ సీఎం సీరియస్‌గా ఉన్నారని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. ఇదిలాఉండగా, సమస్య పరిష్కరించాలంటూ తలసానిని కలిసిన ఆర్టీసీ కార్మికులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి పర్యటనలో ఉన్న తలసానిని ఆర్టీసీ కార్మికులు కలిశారు. తమ సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేయాలని మంత్రిని కోరారు. దీంతో కార్మికులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన తలసాని అక్కడి నుంచి వెళ్లిపోయారు.