షర్మిలకు తెలంగాణ సెగ
వైకాపా వైఖరి ప్రకటించాలని డిమాండ్
షర్మిలకు వ్యతిరేఖంగా నినాదాలు
విద్యార్థులపై వైకాపా గుండాల దాడి
మహబూబ్‌నగర్: డిసెంబర్ 4,(జనంసాక్షి):
షర్మిలకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వైకాపాకు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ పాదయాత్రను అడ్డుకున్నారు. దీంతో సీమాంధ్ర గుండాలు విద్యార్థులపై దాడి చేశారు. మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న వైకాపా అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలో పెద్దషాక్ తగిలింది. షర్మిల పాదయాత్ర పాలమూరు విశ్వవిద్యాలయం వద్దకు చేరుకరోగానే పెద్ద ఎత్తున విద్యార్థులు విశ్వవిద్యాలయం పైకి చేరుకుని ఆమెపై టమాటలు, రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్తితి ఏర్పడింది. విద్యార్థుల ప్రతిఘటనతో షర్మిల కొద్ది దూరం వరకు పాదయాత్ర ఆపేసి కారులో వెళ్లారు. పోలీసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు షర్మిల కాన్వాయ్‌పైన రాళ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు షర్మిలకు ఎంతగా భద్రత ఊర్పాటు చేసినా విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గలేదు. షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జై తెలంగాణ అంటూ గొంతెత్తారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారటంతో షర్మిల పాదయాత్ర కొద్దిసేపు ఆగి పోయింది. విద్యార్థుల ప్రతిఘటనతో వైఎస్సార్ సీపీ పార్టీ శ్రేణులు వారిపై దాడులకు తెగబడ్డారు. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కూడా విశ్వవిద్యాలయంలోకి చోరబడి విద్యార్థులను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. విద్యార్థులు పాలమూరు విశ్వవిద్యాలయం ముఖ ద్వారం ఎదుట షర్మిల దిష్టి బొమ్మ వేేలాడదీశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నంద్యాల ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను, జగన్ పార్లమెంట్‌లో సమైకాంధ్ర ప్లకార్డు పట్టుకున్న విషయాన్ని ఇక్కడి ప్రజలు మర్చిపోలేదని తెలిపారు. తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యూనివర్శిటీలోకి చొరబడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణపై వైఖరి చెప్పకుండా యాత్ర కొనసాగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.