షూటింగ్ బాల్ క్రీడ కు పెరుగుతున్న ఆదరణ
ఈనెల 28 నుంచి తొర్రూరు లో రాష్ట్రస్థాయి క్రీడలు
– షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్.
తొర్రూరు:25సెప్టెంబర్ (జనంసాక్షి )
షూటింగ్ బాల్ క్రీడకు రాష్ట్రంలో మంచి ఆదరణ లభిస్తోందని షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్ తెలిపారు.ఈనెల 28 నుంచి 30 వరకు తొర్రూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించే షూటింగ్ బాల్ రాష్ట్రస్థాయి క్రీడల పోస్టర్లను ఆదివారం డివిజన్ కేంద్రంలో షూటింగ్ బాల్ బాధ్యులు, ప్రజా ప్రతినిధులు ఆవిష్కరించారు.
షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, క్రీడల కన్వీనర్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు తదితరులు పోస్టర్లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ …
ఈనెల 28 నుంచి 30 వరకు తొర్రూర్ లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహిస్తున్నట్లు, క్రీడల్లో 33 జిల్లాల నుంచి సుమారు 800 మంది క్రీడాకారులు హాజరు కానున్నారని తెలిపారు. షూటింగ్ బాల్ క్రీడకు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా తొరూరులో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
భారత్ లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన షూటింగ్ బాల్ క్రీడను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని తెలిపారు.
దేశంలో క్రీడామంత్రిత్వశాఖ గుర్తించిన అన్ని క్రీడలతో సమానంగా షూటింగ్‌బాల్‌కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో దీనిపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. వ్యాయామ విద్యలో షూటింగ్‌బాల్‌ను భాగం చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. 2014లో రాష్ట్రంలో షూటింగ్ బాల్ క్రీడ ఏర్పడినా ప్రాచుర్యంలోకి రాలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ క్రీడను ప్రోత్సహిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో క్రీడాభివృద్దికి దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుందన్నారు. క్రీడా పాలసీ తయారీకి క్రీడల అభివృద్ది మౌలిక సదుపాయాల కల్పన కోసం కేబినేట్ సబ్‌కమిటీని నియమించిందన్నారు.
ఇందు కోసం వివిధ దేశాల క్రీడా పాలసీలను తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. క్రీడల అభివృద్ధి, ప్రోత్సాహం కోసం క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2శాతం, ఉన్నత విద్య కోసం 0.5శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడాకారులకు ఇప్పటివరకు రూ. 25.87 కోట్ల నగదు ప్రోత్సహకాలను తెలంగాణ ప్రభుత్వం అందించిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలను నిర్మించేందుకు కృషి చేస్తోందన్నారు. క్రీడాకారులను, కోచ్ లను రాష్ట్ర క్రీడా శాఖ ప్రోత్సహిస్తుందన్నారు.
క్రీడలు దేహధారుడ్యాన్ని పెంపొందిస్తాయని, స్నేహ పూరిత వాతావరణంలో క్రీడాపోటీల్లో పాల్గొనాలన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు.
అద్భుత ప్రతిభ ను కనబరిచే క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుందన్నారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో షూటింగ్ బాల్ క్రీడను అత్యంత ప్రాధాన్యతతో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లి.. రాష్ట్ర కీర్తిని ప్రపంచ స్థాయిలో చాటి చెబుతామని తెలిపారు.
షూటింగ్ బాల్ రాష్ట్రస్థాయి పోటీల కన్వీనర్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, మునిసిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య మాట్లాడుతూ.
140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో క్రీడల్లో సరైన పథకాలు రాలేదని, కేంద్ర ప్రభుత్వం షూటింగ్ బాల్ క్రీడకు సరైన ప్రాధాన్యత కల్పించాలన్నారు. సీఎం కేసీఆర్ క్రీడాకారుల కోసం రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి ఆదుకుంటున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 47 క్రీడా స్టేడియాలను నిర్మించడంతో పాటు ప్రతీ నియోజకవర్గానికి ఒకటి నిర్మించి అండగా నిలవడం గర్వకారణమన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుండె బాబు,
టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగ సురేందర్ రెడ్డి,షూటింగ్ బాల్ రాష్ట్ర కార్యదర్శి చెడుపల్లి ఐలయ్య, పిడి సతీష్ , టిఆర్ఎస్ నాయకులు కర్నే నాగరాజు, మణిరాజ్, ఎర్ర సంపత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
—