షెరిన్‌ శరీరంలో ఎముకలు విరిగిపోయాయి 

హ్యూస్టన్‌, నవంబర్‌30(జ‌నంసాక్షి) : సంచలనం రేపిన మూడేళ్ల చిన్నారి షెరిన్‌ హత్య కేసుకు సంబంధించి కీలకమైన విషయాలను అక్కడి వైద్య అధికారులు వెల్లడించారు. షెరిన్‌ శరీరంలో ఎముకలు విరిగిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీనికి సంబంధించిన నివేదికను వైద్యాధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. నివేదికపై శిశువైద్యుడు సుషాన్‌ దకిల్‌ మాట్లాడుతూ.. చిన్నారి శరీరానికి సంబంధించి ఎక్స్‌రేలను పరిశీలించినట్లు తెలిపారు. సెప్టెంబరు 2016 నుంచి ఫిబ్రవరి 2017 మధ్యలో షెరిన్‌ శరీరంలో పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. తొడ ఎముకకు చికిత్స చేసిన గుర్తులు ఎక్స్‌రేల్లో తెలుస్తున్నాయి. పాప శరీరంలోని కొన్ని భాగాల్లో ఎముకలు విరిగిపోయాయి. భారత్‌ నుంచి దత్తత తీసుకొని వెళ్లిన తర్వాతే పాప శరీరంలో ఈ గాయాలు అయినట్లు దకిల్‌ చెబుతున్నారు. పాప శరీరంలో గాయాల గురించి దత్తత తీసుకున్న తల్లి సిని మాథ్యూస్‌ను న్యాయవాదులు ప్రశ్నించగా, ఆమె స్పందించలేదు. టెక్సాస్‌లోని డాలస్‌ శివారు ప్రాంతంలో అక్టోబర్‌ 7న షెరిన్‌ అదృశ్యమైన విషయం తెలిసిందే. పాలు తాగడం లేదని చిన్నారిని అర్ధరాత్రి బయట నిలబెట్టానని, కొద్దిసేపటికి వెళ్లి చూస్తే పాప అక్కడ లేదని తండ్రి వెస్లీ మాథ్యూస్‌ పోలీసులకు చెప్పాడు. అక్టోబర్‌ 22న చిన్నారి షెరిన్‌ మృతదేహం ఇంటికి సవిూపంలో లభ్యమైంది. దీంతో వెస్లీని పోలీసులు విచారించడంతో అసలు విషయం బయట పెట్టాడు. పాలు తాగకపోవడంతో బలవంతాన పాలు తాగించేసరికి వూపిరాడక పాప చనిపోయిందని వెస్లీ నేరాన్ని అంగీకరించాడు. షెరిన్‌ను భారత్‌కు
చెందిన ఓ అనాథాశ్రమం నుంచి వెస్లీ, సిని మాథ్యూస్‌ దంపతులు గతేడాది దత్తత తీసుకున్నారు. ఈ కేసులో ప్రస్తుతం వీరిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు.