సంక్షేమం లక్ష్యంగా కార్యక్రమాల అమలు
మేనిఫెస్టోలో లేకపోయినా కాపునేస్తం కింద సాయం
మాది అన్ని వర్గాల ప్రభుత్వం అన్న సిఎం జగన్
చంద్రబాబు లాగా దోచుకునే ప్రభుత్వం కాదని వెల్లడి
గొల్లప్రోలులో కాపునేస్తం నిధులు విడుదల
కాకినాడ,జూలై29(జనంసాక్షి ): కాపులతో పాటు ప్రతీ సామాజికవర్గ సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం
తమదని, మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్సార్ కాపు నేస్తం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మూడు లక్షల మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవాళ నేరుగా డబ్బు జమ చేయడం దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన వైఎస్సార్ కాపు నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మనది అక్కచెల్లెమ్మల ప్రభుత్వం. మనది రైతు ప్రభుత్వం. మనది పేదలకు మంచి చేసే ప్రభుత్వం. మనది.. అన్నివర్గాల ప్రభుత్వం.. మనసున్న ప్రభుత్వం అని సగర్వంగా ప్రకటించుకున్నా అని సీఎం జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినా వైఎస్సార్ కాపు నేస్తం అందిస్తున్నామని, అన్ని వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ ఉద్ఘాటించారు.
వరుసగా మూడో ఏడాది కాపు అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం. వరుసగా ఈ ఏడాది కూడా రూ.15వేలు వాళ్ల అకౌంట్లలో నేరుగా జమ చేస్తున్నాం. ఇప్పటివరకు 1,492 కోట్ల రూపాయల సాయం అందించాం. ఈ ఏడాది 3లక్షల 38 వేల 792 మంది కాపు మహిళలకు లబ్ది చేకూర్చేలా చేశాం. నవరత్నాల ద్వారా మూడేళ్లలోనే కాపు సామాజిక వర్గానికి రూ.16,256 కోట్ల లబ్ది చేకూరింది. మొత్తంగా కాపు సామాజిక వర్గానికి ఈ మూడేళ్లలో సంక్షేమపథకాల ద్వారా రూ.32,296 కోట్లు లబ్ది చేకూరిందని సీఎం జగన్ తెలిపారు.
అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్నామని, క్రమం తప్పకుండా ఈ పథకం అమలు చేస్తున్నా మని, ప్రతీ పేదవాడికి అండగా ఉండడమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఉద్దేశం అని సీఎం జగన్ స్పష్టం చేశారు.డీబీటీ అంటే.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్. డీబీటీ ద్వారా అవినీతికి తావులేకుండా నేరుగా సంక్షేమ పథకాల నిధుల్ని.. లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.చంద్రబాబు పాలనలో డీపీటీ సమర్థవంతంగా అమలు అయ్యిందని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ’డీపీటీ’ అంటే.. దోచుకో.. పంచుకో.. తినుకో అని సీఎం జగన్ నిర్వచించారు. డీపీటీ ద్వారా దుష్ట చతుష్టయం వీరికి తోడు దత్తపుత్రుడు అంతా కలిసి సామాజిక న్యాయం పాటించారని ఎద్దేవా చేశారు. కాపుల ఓట్లను మూటగట్టి చంద్రబాబుకు అమ్మడానికి దత్తపుత్రుడు ప్రయత్నిస్తున్నాడు. మన ప్రభుత్వం డీబీటీ ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం కావాలా? చంద్రబాబు హయాంలో ఉన్న దోచుకో, పంచుకో, తినుకో కావాలా?..అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, ఎల్లోవిూడియాకు తెలిసింది అవినీతి మాత్రమే. చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు. హుద్‌హుద్ వచ్చినప్పుడు 11 రోజుల పాటు నేనే స్వయంగా ఉత్తరాంధ్రలో తిరిగా. ఆ సమయంలో పాచిపోయిన పులిహోర ప్యాకెట్లను బాధితులకు పంచాడు ఆయన. కానీ, మా హయాంలో విపత్తు వస్తే బాధితులను సక్రమంగా ఆదుకుంటున్నాం. వరద బాధితులు ఏ ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా రేషన్‌తో పాటు ప్రతీ ఇంటికి రూ.2 వేలు ఇస్తున్నాం. చంద్రబాబు తన పాలనలో ఒక్క రూపాయి ఇవ్వలేకపోయారు. అలాగే.. జగనన్న పాలనలో లబ్ది జరగలేదని చంద్రబాబు ఏ ఒక్కరినీ చూపలేకపోయారు. అబద్దాల మార్క్ చంద్రబాబు కావాలా? ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఈ ప్రభుత్వం కావాలా?.. ఎవరి పాలన కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సీఎం జగన్ పిలుపు ఇచ్చారు.