సంక్షేమ కార్యక్రమాలకు.. ఎన్టీఆరే ఆధ్యుడు
– ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ
– ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యుల ఘన నివాళి
హైదరాబాద్, జనవరి18(జనంసాక్షి) : బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారని, సంక్షేమ కార్యక్రమాలకు ఆధ్యుడు ఎన్టీఆరే అని సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా నగరంలోని బేగంపేటలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి బాలకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీని ప్రారంభించారు. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఘాట్ వరకు అమరజ్యోతి ర్యాలీ సాగనుంది. అనంతరం బాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు చేయూతనిచ్చి అధికారం కట్టబెట్టిన ఘనత తన తండ్రికి చెందుతుందని అన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఆయన గుర్తుండిపోతారని చెప్పారు. తెలుగువారందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ ఎన్టీఆర్ అని, ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని నందమూరి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ కుమార్తె సుహాసిని మాట్లాడుతూ.. తాత ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడుస్తామని, ఆయన స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నామని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎల్లప్పుడూ కృషి చేశారన్నారు. ప్రజలు ఆయనకు దేవుళ్లతో సమానమని, వారి కోసం ఎంతో పాటు పడ్డారని చెప్పుకొచ్చారు. ఆయనను స్మరించుకుంటూ నివాళులు అర్పించామని తెలిపారు. అదేవిధంగా సినీ దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. మరణం లేని మహానీయుడు ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా తమ తాతకు నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ ఘాట్‌ను కూడా పట్టించుకోవడం లేదు – లక్ష్మీపార్వతి
ఎన్టీఆర్‌ను చంపిన వాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎన్టీఆర్ 23వ వర్థంతి సందర్భంగా లక్ష్మీ పార్వతి విూడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ ఎప్పటికి తెలుగు వారి గుండెల్లో ఆరాధ్యుడే అని కొనియాడారు. కానీ తన గుండెల్లో మంట చల్లారలేదని.. కళ్లలో నీరు ఇంకా ఇంకలేదని ఆవేదనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆత్మ శాంతించలేదని.. ఆయన ఆత్మ ఘోషిస్తుందని వాపోయారు. ఎన్టీఆర్‌ను చంపిన వాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మహిళలను ఎంతో గౌరవించేవారని.. కానీ నేటి టీడీపీ నేతలు మహిళల పట్ల చాలా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ ఘాట్‌ను కూడా సరిగా పట్టించుకోవడం లేదని పెచ్చులూడుతున్నాయని తెలిపారు. ఇది ఎన్టీఆర్‌కు అవమానం అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని గమనించి ఘాట్‌కు మరమ్మతులు చేయాలని కోరారు.