సంక్షేమ పథకాలతో తెలంగాణ దిశ మారింది
ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
కాంగ్రెసోళ్లకు ఓట్లు అడిగే హక్కు లేదు
ప్రచారంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్,నవంబర్20(జనంసాక్షి): సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందాయని, ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ద్రోహి చంద్రబాబు వలలో పడి మహాకూటమి పేరుతో మరోమారు తెలంగాణాను నాశనం చేసేందుకు వస్తున్నారని అన్నారు. మంగళవారం సారంగాపూర్ మండలంలోని ప్యారామూర్, తాండ్ర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మంత్రికి మహిళలు మంగళహారతులిచ్చి, బొట్టు పెట్టి స్వాగతం పలికారు. భారీ ర్యాలీ, డప్పు చప్పుళ్ల మధ్య ప్రచారం జరిగింది. దీంతో గ్రామాలు గులాబీమయంగా మారాయి. మరోసారి అండగా ఉండి.. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిర్మల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచిన కాంగ్రెసోళ్లకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసిన ప్రజలు.. తాను ప్రచారం కోసం ఏ గ్రామానికెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కూటమి నేతలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు వాటిని తిప్పికొడుతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులను అడ్డుకునేందుకు మహాకూటమిగా ఏర్పడి మరో కుటిల డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. గతంలో ఇలాంటి ఆంధ్ర పాలకుల మోసాలకు మోసపోయి తెలంగాణకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. వారి పాలనకు విసుగు చెంది నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకునేందుకు కోట్లాడి తెలంగాణను సాధించుకున్నామని, అభివృద్దిని చూసి ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీలు మళ్లీ తెలంగాణను దోచుకునేందుకు వస్తున్నారని విమర్శించారు.
టీఆర్ఎస్ రైతులు అడగకుండానే 24 గంటల ఉచిత కరెంట్ అందించిందన్నారు. నాడు కాంగ్రెస్, టీడీపీ పాలనలో రైతుల కండ్లలో కన్నీరు చూస్తే నేడు టీఆర్ఎస్ సుపరిపాలనలో రైతుల కండ్లలో ఆనందం చూస్తున్నామన్నారు. వ్యవసాయం అంటే దండుగా అన్న దుస్థితి నుంచి.. పండుగ అన్న స్థితికి తెచ్చిన ఘనత టీఆర్ఎస్దేనన్నారు.రైతన్నల కష్టాలు తెలిసిన నేత కేసీఆర్ అని, మరోసారి టీఆర్ఎస్ పాలనను తీసుకురావడానికి రైతులు కృషి చేయాలని కోరారు. గౌడన్నలకు తాటీ పన్ను రద్ధు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. అంతేకాకుండా యాదవులకు సబ్సిడీపై గొర్రెలు, రైతులకు సబ్సిడీపై పాడి గేదెలు, చేపల పంపిణీ, కుల సంఘాల భవనాల నిర్మాణం ఇలా అన్ని వర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. అదేవిధంగా ఆసరా, సాగు నీరు అందించేందుకు మిషన్ కాకతీయ, తాగునీటి కోసం మిషన్ భగీరథ, ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహకారం కోసం కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా ఇలా ఎన్నో పథకాలను పారదర్శంగా అమలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా రైతు సమన్వయ కన్వీనర్ నల్లా వెంకట్రామ్ రెడ్డి, సారంగాపూర్ ఏయంసీ రాజ్ మహ్మద్, అడెల్లి ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సారంగాపూర్ మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అల్లోల మురళీధర్ రెడ్డి,పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ,జీవన్ రావు తదితరులు ఉన్నారు.