సంక్షోభంలో వ్యవసాయ రంగం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 7 :జిల్లాలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిందని ఎరువులు, విత్తనాలు ధరలు పెరగడంతో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితిల్లో లేరని అఖిలపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నా రైతులకు సరైన దిగుబడి రాక, వచ్చిన పంటకు ధరలు లేక అప్పులు తీర్చలేక నిరాశతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌ జిల్లాలో ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని నాయకులు రాంనాథ్‌, శ్రీహరిరావు, విజయకుమార్‌, శంకర్‌లు పేర్కొన్నారు. రైతుల ప్రయోజనార్థం కోసం  కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 421 జీవో అమలు చేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతుల్లో మనోనిబ్బరాన్ని పెంచేందుకు పార్టీలకు అతీతంగా ర్యాలీలు చేపట్టి వారిని చైతన్య పరిచాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ప్రభుత్వం అఖలపక్ష కమిటీని ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలను పూర్తిస్థాయిలో ఆదుకునేల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. జిల్లాలో  పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20 వేల చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు.