సంపన్నులకు సాయం…పేదలకు భారం
.సామాజిక ప్రయోజనాలకు కోత
.అమెరికా బడ్జెట్‌లో ఒబామా పదేళ్ల ప్రతిపాదనలు
వాషింగ్టన్:బుధవారం నాడు కాంగ్రెస్‌కు సమర్పించిన ఐదవ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉత్పత్తి, విద్య, పరిశోధనా రంగాల్లో పెట్టుబడులను పెంచుతున్నట్లు ప్రకటించారు. పనిలో పనిగా పన్నులను పెంచేందుకు, ప్రభుత్వ వ్యయాలను తగ్గించేందుకు ప్రతిపాదనలు చేశారు. అయితే బడ్జెట్ ప్రతిపాదనలను విశ్లేషిస్తే బడ్జెట్ లోటును తగ్గించుకునేందుకుగాను ఆయన సంపన్నులపై విధించే పన్నులపై కంటే ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు.ముఖ్యంగా సామాజిక ప్రయోజనాలను తగ్గించడానికి దోహదం చేసే వివిధ ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు. రిపబ్లికన్, డెమొక్రాట్ల మధ్య వైరుధ్యాలు నెలకోన్న విషయాల్లో ఆయన మధ్యేమార్గాన్ని అనుసరించారు. మొత్తం మీద ఒబామా చేసిన బడ్జెట్ ఫీట్ ఎవరినీ సంతృప్తిపరచలేక పోయిందనే చెప్పాలి…వైద్య,సామాజిక భద్రతలకు సంబంధించిన అనేక మార్పులను ప్రవేశపెట్టారు. అయితే ఆయన చేసిన ప్రతిపాదన భవిష్యత్తులో సామాజిక భద్రతా ప్రయోజనాలను తగ్గించే విధంగా ఉంది. కిండర్‌గార్టెన్‌కు ముందు దశ ఉన్న విద్యాసంస్థలకు తగిన ఆర్థిక సహయం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. పోగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచారు.అక్టోబర్ ఒకటిన ప్రారంభమయ్యే కోత్త ఆర్ధిక సంవత్సరానికి 744 బిలియన్ డాలర్లలోతో ఆయన బడ్జెట్ సమర్పించారు.ఇది జిడిపిలో 4.4 శాతంగా ఉంది. మాంద్యం పరిస్థితులు నెలకోన్న సమయంలో ఈలోటు పది శాతం ఉండేది.ఈ సంవత్సరాంతానికి లోటు1.7 శాతం తగ్గిగలదని అంచనా వేశారు. అయితే బడ్జెట్ ప్రతిపాదనలపై రిపబ్లికన్ సెనేటర్లు పెదవి విరిచారు. సంపన్నులపై పన్నులు పెంచడాన్ని వారు వ్యతిరేకించారు. ప్రభుత్వ వ్యయాన్ని ఆశించిన మేరకు తగ్గించలేకపోయారని పేర్కోన్నారు. డెమొక్రాట్లతో రాజీ కుదుర్చుకోవచ్చు నని, రిపబ్లికన్ సెనేటర్లను ఈ ప్రతిపాదనలకు ఓప్పించవచ్చునని ఒబామా భావిస్తున్నారు. డెమొక్రాట్ల అభ్యంతరాల నేపథ్యంలో సామాజిక భద్రత, ఆరోగ్య రంగంపై బబామా రాజీ ప్రతిపాదనలు చేశారు. జాతీయ రుణాన్ని స్థిరీకరించే విషయంలో తనకు చిత్తశుద్ధి ఉందని రిపబ్లికన్లను ఒప్పించేందుకు ఆయన ప్రయత్నించారు.