సంబురాలు కాదు.. ఇక సమరమే !

– పుండు మీద కారం చల్లిన సీఎం వ్యాఖ్యలు
– పొంతన లేని వయలార్‌ మాటలు
– ‘ఏకాభిప్రాయాన్ని’ వల్లె వేస్తున్న ఆజాద్‌
– రాజీనామాలపై టీమంత్రుల వెనుకంజ
– ప్రత్యేక రాష్ట్రంపై కాంగ్రెస్‌ యూ టర్న్‌ ?
– మండిపడుతున్న తెలంగాణ ప్రజలు
-మరిన్ని ‘మార్చ్‌’లకైనా సిద్ధమంటున్న పోరు బిడ్డలు
హైదరాబాద్‌, అక్టోబర్‌ 3 (జనంసాక్షి) :
అధికార కాంగ్రెస్‌ పార్టీ తమ నైజాన్ని మరోసారి బయటపెట్టింది. తెలంగాణ మార్చ్‌తో వీళ్ల దిమ్మతిరిగినా, దున్నపోతు మీద వాన పడ్డ చందాన ఎప్పటిలాగే దులిపేసుకున్నారు. తెలంగాణ మార్చే ఆఖరి ఉద్యమమని, ఇక తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రం చర్యలు ప్రారంభించే అవకాశముందని తెలంగాణ ప్రజలు భావించారు. కేంద్రం కూడా మార్చ్‌ నేపథ్యంలో కేసీఆర్‌తో చర్చలు జరపడం, మార్చ్‌కు అనుమతివ్వడం, ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ నిరసనను తెలుపవచ్చునని కేంద్ర నాయకులు వ్యాఖ్యలు చేయడం ప్రజలను కూడా మరోసారి నమ్మేలా చేసింది. కానీ, మార్చ్‌ ముగిసిన రెండో రోజు నుంచే ‘మేము మారం’ అన్నట్లు కాంగ్రెస్‌ పాలకులు వ్యవహ రిస్తున్నా రు. మార్చ్‌కు అనుమతిచ్చిన సర్కారే, 30న తెలంగాణ వాదులను నెక్లెస్‌ రోడ్డుకు రాకుండా అడ్డుకునేందుకు చితకబాదింది. పైగా ఇప్పుడు తెలంగాణవాదులే విధ్వంసం సృష్టించారని కేసులు పెడుతానంటోంది. సీఎం కిరణ్‌ కూడా ఓ అడుగు ముందుకేసి ప్రత్యేక రాష్ట్ర సాధన తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాదన్నట్లు, రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించడం కుదరదని వ్యాఖ్యానించి తెలంగాణ వాదులను రెచ్చగొట్టారు. ఇక కేంద్ర నాయకుల విషయానికి వస్తే మార్చ్‌కు ముందు కేసీఆర్‌తో రోజుకోసారి చర్చలు జరిపిన వయలార్‌ రవి ఓ రోజు తెలంగాణ ఎక్కడుందని విలేకరుల ముందే ప్రశ్నిం చారు. ఆ తర్వాత మజాకాడినానని చెప్పుకొ చ్చారు. ఈ లెక్కన కేంద్రం పెద్దలకు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మజాకుగా తోస్తున్నదా అని ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్‌ సారేమో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని పాత పాటనే కాస్త శృతి పెంచి అందుకున్నారు. మార్చ్‌ రోజున హైదరాబాద్‌లో తెలంగాణవాదుల అరెస్టులు జరుగుతుంటే, జానారెడ్డి నాయకత్వంలో సమావేశమైన టీమంత్రులు ఉద్యమం కోసం తమ పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడమని ప్రకటించారు. మార్చ్‌ ముగియగానే తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. తమకు తమను ఎన్నుకున్న ప్రజల కన్నా పదవులే ముఖ్యం అన్న రీతిలో రాజీనామా చేయమనడానికి జేఏసీ ఎవరని టీమంత్రుల నాయకుడు జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా, జేఏసీని ఏర్పాటు చేసిందే తనంటూ ఊగిపోయారు. జానా వ్యాఖ్యలతో యావత్‌ తెలంగాణ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జేఏసీ ఏర్పాటైంది తెలంగాణ ఆకాంక్షల కోసం గానీ, టీ మంత్రులకు వత్తాసు పలుకడానికి కాదని ఓయూతో సహా పలు చోట్ల జానా దిష్టిబొమ్మలను తెలంగాణవాదులు దహనం చేశారు. జానారెడ్డి రాజీనామాలతో ప్రభుత్వం ఒత్తిడి పెంచుతాడనుకుంటే మళ్లీ మోసం చేశాడని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఢిల్లీలో మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మంతనాల్లో ఏం చర్చించారో ఇప్పటి వరకు ఆయనకు తప్ప ఏ తెలంగాణవాదికి కూడా తెలియదు. మంగళవారం హైదరాబాద్‌ వచ్చిన ఆయన తుది దశ చర్చలు త్వరలో అని ప్రకటించారు. తీపి కబురు చెబుతారనుకున్న ఆయన కూడా తెలంగాణవాదులను నిరాశపర్చారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, వీళ్లతో ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చినట్లు అనిపిస్తున్నది. దీనికి బలం చేకూరుస్తున్నట్లు పలువురు తెలంగాణవాదులు మరిన్ని మార్చ్‌లకైనా తాము సిద్ధమని అంటున్నారు. మార్చ్‌తో కేంద్రం దిగి వస్తుందని సంబురాలు జరుపుకుందామనుకున్న తెలంగాణ బిడ్డలు, ప్రస్తుత పరిణామాలతో మళ్లీ సమరానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.