సంయుక్త పార్లమెంటరీ కమిటీ ముందుకు భన్సాలీ

న్యూఢిల్లీ,నవంబర్‌30(జ‌నంసాక్షి): పద్మావతి చిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఇవాళ సంయుక్త పార్లమెంటరీ సంఘం ముందు హాజరయ్యారు. పార్లమెంటరీ సంఘం ముందు హాజరుకావాలని భన్సాలీకి తొలుత సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ పార్లమెంట్‌ ప్యానెల్‌ను కలిసేందుకు వెళ్లారు. భన్సాలీ తీసిన పద్మావతి ఫిల్మ్‌ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీపిక నటించిన పద్మావతి ఫిల్మ్‌.. వాస్తవానికి శుక్రవారం రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ ఆ సినిమాకు ఇంత వరకు సెన్సార్‌ బోర్డు నుంచి అనుమతి రాలేదు. అంతేకాదు రాజ్‌పుత్‌ చరిత్రను వక్రీకరించారన్న నేపథ్యంతో కొన్ని రాష్టాల్రు ఆ సినిమాను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశాయి. పద్మావతిని తమ రాష్టాల్ల్రో రిలీజ్‌ చేయబోమని ఇప్పటికే రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్టాల్రు స్పష్టం చేశాయి. అయితే తాజాగా సుప్రీంకోర్టు మాత్రం పద్మావతి బృందానికి అండగా నిలిచింది. పద్మావతి చిత్రంపై స్టే ఇవ్వబోమని తేల్చి చెప్పింది. సినిమాకు

గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అంశం సెన్సార్‌ బోర్డు పరిధిలోనే ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పద్మావతి చిత్రాన్ని కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. పద్మావతి చిత్రంలో దీపికతో పాటు షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌లు నటిస్తున్నారు.