‘సకల జనుల’కు ఏడాది

ప్రపంచ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం
ప్రజల ఆకాంక్షకు నిలువుటద్దం
తెలంగాణ రాష్ట్ర సాధనకు పునరంకితమవుతాం
వారసత్వపు స్ఫూర్తిని కొనసాగిస్తాం
జనంసాక్షితో టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) :చరిత్రలో అదో మరపు రాని ఘట్టం..ఉద్యోగుల జీతభత్యాల కోసం కాదు..ప్రజల ఆకాంక్షల కొరకు పోరు బాట పట్టిన రోజు..నాలుగు కోట్ల జనం ఆకాంక్షలకు ప్రతిరూపంగా తెలంగాణలో సకలం బంద్‌ అయ్యాయి..జనగుండెల్లో దాగిన ప్రతి బింబం తెలంగాణ కోసం బస్సు కాపయ్యా..అదాలత్‌..దఫ్తర్‌..గనీ..వనీ..ఖార్ఖానా అన్నీ బంద్‌ అయి..సమ్మె సైరన్‌ మోగించిన రోజు..ప్రపంచ చరిత్రలో అరుదైన ఘట్టం సకల జనుల సమ్మె..ఆ మహత్తర రోజుకు ఏడాది పూర్తైంది..జన ఉద్యమం ఆరని మంటల్లా..పేలేందుకు సిద్దమైన అగ్నిపర్వతంలా..ఉప్పొంగే నదులై కట్టలు తెంచే ప్రవాహమై మరో మార్చ్‌కు సిద్ధమౌతున్నారు..ప్రభుత్వం, రాజకీయ నాయకత్వం మాయ మాటల చెప్పి సమ్మెను విరమింప చేసినా, ప్రజల మనోస్థైర్యం తగ్గలేదు..ఆశ చావలేదు..ఆకాంక్ష తగ్గలేదు…మహా సంకల్పంతో ముందుకు సాగుతున్నారు..మరో సంగ్రామానికి సిద్ధమవుతున్నారు..ఏడాది తర్వాత కూడా ఎలాంటి నిరాశకు లోనుకాకుండా తిరిగి సమరశంఖం పూరిస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీప్రాద్‌ అనడం ఆయన మొక్కవోని దీక్షకు నిదర్శనం..ఈ సందర్భంగా జనంసాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూ…
తెలంగాణ సాధనే ధ్యేయంగా సాగిన సకల జనుల సమ్మె స్పూర్తిని ఇక ముందు కూడా కొనసాగిస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీ వరప్రసాద్‌ అన్నారు.. గత ఏడాది సకల జనుల సమ్మె ప్రారంభమైన రోజుకు గురువారంతో సంవత్సరమైన సందర్భంగా ఆయన జనంసాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలంగాణ వచ్చే వరకు పోరు ఆగదని తెలంగాణ సాధించేవరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. గురువారం సకల జనుల సమ్మె కు సంవత్సరం పూర్తైన సందర్భంగా పునరంకిత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట స్పూర్తి దీక్షలు చేయనున్నట్లు తెలిపారు..సకల జనుల సమ్మె స్పూర్తిని ఇక ముందు కూడా కొనసాగిస్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆశ, శ్వాస అయిన తెలంగాణ సాధనకు ప్రతి ఒక్క పార్టీ మద్ధతు ఇవ్వాలన్నారు.ఈ నెల 30న నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌కు పెద్ద సంక్యలో హాజరయి తెలంగాణ ఉద్యమ స్పూర్తిని చాటాలన్నారు..తెలంగాణ మార్చ్‌తో కేంద్రం దిమ్మ తిరిగడం ఖాయమన్నారు..ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు…