సకాలంలో ఇళ్లు పూర్తి చేయకపోతే చర్యలు

ఖమ్మం, నవంబర్‌ 3 : గృహ నిర్మాణ శాఖ ద్వారా నిర్మిస్తున్న గృహాలను సకాలంలో పూర్తి చేయడానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాందేవ్‌రెడ్డి అన్నారు. లబ్ధిదారుల్లో ఇళ్ల గురించి అవగాహన కల్పించాలని అన్నారు. సత్తుపల్లి, చండ్రుగుండ, వేంకూరు, కొత్తగూడెం, బయ్యారం, టేకులపల్లి, ఇల్లందు, అశ్వరావుపేట, పినపాక, అశ్వాపురం, మణుగూరు, భద్రాచలం, వాగేడు, వెంకటాపురం మండలాల్లో గృహ నిర్మాణ శాఖ పురోగతి తక్కువగా ఉన్నదని అన్నారు. ఇక్కడ ప్రగతి పెంచడానికి అధికారులు కృషి చేయాలని, లేనిపక్షంలో వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. జిల్లాలో ఇసుక సమస్యతో రెండు నెలల నుంచి కూడా గృహ నిర్మాణం నత్తనడకన నడుస్తోందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లబ్ధిదారులకు ఇసుక సమస్య తలెత్తకుండా చూడాలని తహశీల్దార్లకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఇంతవరకు ప్రారంభించని గృహాలు 86 వేలు ఉన్నాయని, వీటిని సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మిత కేంద్రాలను పటిష్టం చేసి వాటి ద్వారా లబ్ధిదారులకు కిటికిలు, దర్వాజలు, ఇటుకలు, ఇతర సామాగ్రిని సరఫరా చేయించాలని తెలిపారు.