సచిన్‌ సెలెక్టర్లతో మాట్లాడాలి రిటైర్మెంట్‌పై కపిల్‌ సూచన

న్యూఢిల్లీ ,నవంబర్‌ 27:  మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రిటైర్మెంట్‌పై భారత క్రికెట్‌ వర్గాల్లో చర్చ మరింత జోరందుకుంది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న సిరీస్‌లోనూ సచిన్‌ విఫలమవుతుండడంతో విమర్శకులు స్వరం పెంచారు. అయితే బోర్డు మాత్రం సచిన్‌కు మధ్ధతుగా నిలిచింది. ఈ నేపథ్యంలో మాజీ భారత కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ దీనిపై స్పందించాడు. రిటైర్మెంట్‌కు సంబంధించి సచిన్‌ సెలక్టర్లతో మాట్లాడాలని కపిల్‌దేవ్‌ సూచించాడు. ఇప్పటి వరకూ పలుసార్లు చర్చ జరుగుతున్నా… సచిన్‌ మాత్రం సెలక్టర్లతో ఎప్పుడూ చర్చించడం లేదన్నాడు. అటు సచిన్‌ను అడిగే ధైర్యం సెలక్టర్లకు లేదని, వారు కూడా మౌనంగా ఉండడం సరికాదని వ్యాఖ్యానించాడు. కాగా గవాస్కర్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 23 ఏళ్లుగా భారత క్రికెట్‌కు ఎనలేని సేవలందించిన సచిన్‌ గొప్ప ఆటగాడని, అయితే వరుస వైఫల్యాల సమయంలో అందరూ అతన్ని తప్పుపట్టడం బాధ కలిగిస్తోందన్నాడు. కెరీర్‌ అత్యున్నత సమయంలో ఉన్నప్పుడే రిటైరవడం మంచిదని గతంలో తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు.  ఇక కెప్టెన్‌ ధోనీ ఆటతీరును కపిల్‌ ప్రశ్నించాడు. గత పది టెస్టుల్లో కూడా భారత కెప్టెన్‌ వ్యక్తిగతంగా విఫలమవడంపై విమర్శలు గుప్పించాడు. ఇలాగే కొనసాగితే తుది జట్టులో ధోనీకి చోటు కల్పించడం సరికాదన్నాడు. సొంతగడ్డపై పరుగులు చేయలేకపోవడం కంటే వేరే అవమానం ఏదీ ఉండదని వ్యాఖ్యానించాడు. అటు లక్ష్మణ్‌ , ద్రావిడ్‌ రిటైర్మెంట్‌ నేపథ్యంలో జట్టుపై ప్రభావం చూపిందని కపిల్‌ చెప్పాడు. అయితే మిగిలిన రెండు టెస్టుల్లో భారత్‌ పుంజుకుంటుదని ధీమా వ్యక్తం చేశాడు.