సడలని విశాఖ ఉక్కు ఉద్యమ సంకల్పం

వేయిరోజులు దాటినా పడని వెనకడుగు
రాజకీయ పార్టీలు విస్మరించినా పట్టించుకోని కార్మికలోకం
విశాఖపట్టణం,సెప్టెంబర్‌22(జనం సాక్షి  ): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటులోకే నెట్టబడుతుందన్న ఆందోళన క్రమంగా పెరుగుతోంది.. విశాఖ ఉక్కును రక్షించుకునే క్రమంలో కార్మిక వర్గాలు చేస్తున్న పోరాటం వేయి రోజులు దాటినా సాగుతూనే ఉంది. వారి ఉక్కు సంకల్పం అభినందనీయం. రాష్టావ్రృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న గిరిజనులకు రిజర్వేషన్ల ద్వారా ఇక్కడ ఉపాధి లభిస్తోంది. దీన్ని ప్రైవేట్‌పరం చేయడమంటే దళితులు, గిరిజనులు, బిసిలు ఉపాధి కోల్పోయి సామాజిక న్యాయం హరించుకు పోతుంది. నేటికీ ప్లాంట్‌లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న 8500 మంది నిర్వాసితుల ఆశలు అడియాశలు అవుతాయి. ప్లాంట్‌ పూర్తి స్థాయిలో నడిస్తే మరో పాతిక వేల మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల ఉత్తరాంధ్ర మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ఇలాంటి ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నా ఏ పక్షం కూడా పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు. ఆంధ్ర రాష్ట్రంలోనే అతి పెద్ద పరిశ్రమగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇటువంటి సంస్థను రక్షించుకోవడం ద్వారానే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలం. కానీ దీనికి భిన్నంగా, చాలా విచిత్రంగా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అధికార వైసిపి మొక్కుబడిగా అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులిపేసుకుంది. కానీ రాష్ట్ర ప్రజలను సవిూకరించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కనీస ప్రయత్నం కూడా చేయడంలేదు. ప్రతిపక్ష టిడిపి రాష్ట్ర వైసిపిని విమర్శించడం తప్ప ప్లాంటును అమ్మేస్తామని తెగేసి చెప్పిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనడంలేదు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను అమ్మివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని… తెలుగు ప్రజలు పోరాడి…32 మంది ప్రాణ త్యాగాలతో, 16 వేల మంది రైతుల త్యాగ ఫలంగా సాధించుకున్న ఈ ప్లాంట్‌ను రక్షించుకుని తీరతామని…స్టీల్‌ఎª`లాంట్‌ కార్మికులు, ఈ ప్రాంత ప్రజలు గత వెయ్యి రోజులుగా పోరాడుతున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు సరికదా దీనిని అమ్మడం సాధ్యం కాకపోతే మూసివేస్తామని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర మంత్రి బెదిరింపులకు పూనుకున్నారు. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రజలు, కార్మికులు నీరసపడిపోయి, ఉద్యమాన్ని వదిలేస్తారని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావించింది. అయితే వారి అంచనాలకు భిన్నంగా రెట్టించిన ఉత్సాహంతో, పట్టుదలతో కార్మికులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వీరి పోరాటానికి మద్దతు లభిస్తోంది. మన దేశంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపి ఎజెండాను అమలు చేసేవిగా వున్నాయి తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం లేవనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. దేశంలోని ప్రైవేట్‌ రంగంతో సహా అన్ని స్టీల్‌ ఎª`లాంట్లకు సొంత ముడి సరుకులను, గనులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మాత్రం సొంతగనులు కేటాయించడానికి ససేమిరా నిరాకరిస్తోంది. దీనికి తోడు ఇప్పటి వరకు తక్కువ ధర చెల్లించి ఇనుప ఖనిజాన్ని కొంటున్న ఛత్తీస్‌గఢ్‌ లోని ఎన్‌ఎండిసి నుండి ఇక విూదట కొనుగోలుకు అనుమతించకుండా, దూర ప్రాంతంలోని కర్ణాటక నుండి కొనుగోలు చేసుకోమని తెలిపింది. మొత్తం ప్లాంట్‌ విలువను తగ్గించి చూపి, కారుచౌకగా తమ కార్పొరేట్‌ మిత్రులకు ధారాదత్తం
చేయజూస్తున్నారు. 1400 ఎకరాల స్టీల్‌ప్లాంట్‌ భూమిని ఇప్పటికే గంగవరం పోర్టుకు ఇచ్చేశారు. ఇప్పుడు మరలా మరింత భూమిని అమ్మేయడానికి పావులు కదుపుతున్నారు. అదానీ పోర్టుకి వెయ్యి ఎకరాల భూమిని కేటాయించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నది. అన్ని విధాలుగా స్టీల్‌ప్లాంట్‌ను బలహీనపరిచే చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పాల్పడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఈ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాన్ని రాష్ట్రం లోని ప్రధాన మూడు రాజకీయ పార్టీలు ఎదుర్కోలేవని, అంతే కాకుండా ఈ మూడు పార్టీలు కేంద్ర బిజెపికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరిస్తున్నాయని కూడా తేటతెల్లమై పోయింది. అందువల్ల పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం కేవలం తెలుగు ప్రజల చైతన్యం విూదనే నేడు ఆధారపడి ఉంది. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు ఒక ప్రహసనంగా మార్చివేసింది. ఫలితంగా ఈ తొమ్మిదేళ్ళ కాలంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కాకపోగా మరింత వెనుకబాటులోనికే నెట్టబడిరది. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టు ఊసే మరిచింది. అందువల్ల తెలుగు ప్రజలు విశాఖ ఉక్కు`ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న ప్లాంటును పరిరక్షించుకోవడానికి కూడా ప్రజలే ముందుకు రావాలి.