సతిని గొంతు నులిమి హత్యచేసిన పతి

నిజామాబాద్‌: కామారెడ్డిలోని ఇందిరానగర్‌ కాలనీలో పట్టు భాగ్య(25)ను ఆమె భర్త రాజేశ్వరయ్య ఆలియాస్‌ రాజు హత్య చేశాడు. బీవిపేటకు చెందిన భాగ్య మొదటి భర్తకు విడాకులిచ్చి హైదరాబాద్‌లోని కృష్ణనగర్‌లో నివాసముంటూ టీవిలో, సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్టుగా పని చేస్తుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన రాజేశ్వరయ్య అసిస్టెంట్‌ మేకప్‌ మేన్‌గా పనిచేసేవాడు. వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా పెళ్లి వరకు వెళ్లింది. పెళ్లి చేసుకున్న తర్వాత వీరు కామారెడ్డికి వచ్చి నివాసముంటున్నారు. రాజేశ్వర్‌ ఇక్కడ హోటల్‌లో పనిచేస్తుండేవాడు, తరచు వీరు గొడవపడేవారు. గత ఏడాది డిసెంబర్‌ 5న భాగ్యను ఇంటిలోనే గొంతు నులిమి హత్య చేసి, అర్ధ రాత్రివేళ మృతదేహన్ని ప్లాస్టీక్‌ సంచిలో చుట్టి సెప్టిక్‌ ట్యాంక్‌లో పడేసీ మట్టి పోశాడు. తర్వాత ఇల్లు ఖాళీచేసి వెళ్లి పోయాడు. పోలీసులు మరో కేసులో దొంగను విచారిస్తుండగా అతని వద్ద రాజేశ్వర్‌ సెల్‌ఫోన్‌ నెంబరు దొరికింది. దీని ఆధారంగా విచారించగా విషయమంతా బయటపడింది. రాజేశ్వర్‌ గతంలో కూడా హైదరాబాద్‌లో ముంబాయికి చెందిన ఒక మహిళను హత్య చేశాడు. నిందితుని పోలీసులు అదుపులో తీసుకున్నారు.