సత్తాచాటిన టీమ్‌ఇండియా
మహిళల ఆసియా కప్ ట్వంటీ20 క్రికెట్ టోర్నీలో టీమ్‌ఇండియా సత్తాచాటింది. చివరి లీగ్ మ్యాచ్‌లో నేపాల్‌ను చిత్తు చేసింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 99 పరుగుల ఆధిక్యంతో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. ఇప్పటికే ఫైనల్లో చోటు సంపాదించిన టీమ్‌ఇండియా.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో నెగ్గి 10 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి దూరంగా ఉన్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 5 వికెట్లకు 120 పరుగులు సాధించింది. శిఖా పాండే (39 నాటౌట్) టాప్ స్కోరర్. అనంతరం నేపాల్ 16.3 ఓవర్లలో 21 పరుగులకే కుప్పకూలింది. మహిళల టీ20 క్రికెట్లో ఇదే అత్యల్ప స్కోరు. ఇదే టోర్నీలో బుధవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 44 పరుగులకు ఆలౌటైంది. టీమ్‌ఇండియా, నేపాల్ మ్యాచ్‌కు ముందు వరకు అదే అత్యల్ప స్కోరు. టీ20 క్రికెట్లో మూడో అతిపెద్ద విజయమిది. ఇక ఈ మ్యాచ్‌లో ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. సరిత మాగర్ సాధించిన 6 పరుగులే అత్యధిక స్కోరు. బ్యాటర్‌ల వ్యక్తిగత స్కోరు కంటే ఎక్స్‌ట్రాల (7) సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. నలుగురు నేపాలి బ్యాటర్లు డకౌటయ్యారు. 11వ నెంబర్ బ్యాటర్ సరస్వతికుమారి (0) నాటౌట్‌గా నిలిచింది.