సత్ఫలితం ఇచ్చిన ప్రణాళిక
చివరి భూములకు కూడా నీరందండంతో దండిగా పంటలు
నిజామాబాద్,మే14(జనం సాక్షి): ఇటీవల నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం అనుసరించిన విధానం మంచి ఫలితం ఇచ్చింది. చివరి భూమి లేదా ఆయకట్టు వరకు చేరేలా ప్రణాళిక సిద్దం చేసి అమలు చేశారు. అందుకే నిజాంసాగర్ కింద ఈ యాసంగిలో గతంలో కన్నా ఎక్కవ సాగయినట్లు లెక్కలు చెబుతున్నాయి. గత 37ఏళ్లలో ఇంత విస్తీర్ణంలో సాగు జరగడం ఇదే తొలిసారి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు విస్తరించిన ఈ ప్రాజెక్టు పరిధిలో చివరి ఆయకట్టుదాక పుష్కలంగా నీరు అందడంతో 27 మండలాల రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వానాకాలం పంట సీజన్ తర్వాత భారీ వర్షాలు పడి రిజర్వాయర్‌లోకి నీరు చేరింది. దీనితో యాసంగికి రైతులు సిద్ధమయ్యారు. సాధారణంగా యాసంగిలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటలు వేయడం ఆనవాయితీ. అయితే ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో రైతులు 98శాతం వరి వేసుకున్నారు. ఇప్పుడు కోతలు చేపట్టి మార్కెట్‌కు ధాన్యం తరలిస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు లోని ప్రతి నీటి చుక్కను రైతులకు పొలాలకు తరలించడంలో ప్రభుత్వం అమలు చేసిన వ్యూహాత్మక ప్రణాళిక అమలు చేసింది. భవిష్యత్‌లో అన్ని ప్రాజెక్టులకు ఇదే విధానం అమలు చేయాలన్న సంకల్పంతో సిఎం కెసిఆర్ ఉన్నారు. మంత్రి హరీశ్‌రావు సూచించిన టెయిల్ టు హెడ్ విధానం మంచి ఫలితాన్ని ఇచ్చింది. నిజాంసాగర్ ప్రాజెక్టు చరిత్రలో 1980 నుంచి ఇప్పటివరకు యాసంగిలో ఆయకట్టు ఈ స్థాయిలో సాగైన దాఖలాలు లేవు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత వర్షాలు పడింది మొదలు.. పొలాలకు చేరే వరకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టింది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో మంత్రి హరీశ్‌రావు ప్రధానంగా చివరి రైతుకు నీరందిన తరువాతే డిస్టిబ్యూట్రరీ ముందు ఉన్న రైతుకు నీరందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మూడేండ్ల నుంచి రైతులంతా పడ్డ గోస తీరింది. సర్కారు పద్ధతి ప్రకారం నీళ్లు ఇచ్చిందని అందుకే పంటలను నమ్మకంగా ఊపండించుకోగలిగామని రైతులు ఆనందంగా ఉన్నారు. ప్రభుత్వం విూద నమ్మకంతో ఎప్పుడూ ఆరుతడి పంటలేసుకునే రైతులు కూడ వరి వేసుకున్నారు. చివరన ఉన్న రైతులకు ముందుగా నీళ్లు ఇచ్చి, ఆపై క్రమంగా మొదట ఉన్నవారు వాడుకునేలా చర్యలు తీసుకున్నారు. రైతులు పూర్తి సహకారాన్ని అందించడంతో టెయిల్ టు హెడ్ విధానం విజయవంతమైందని అధికారులు కూడా అంటున్నారు. ఇలా ప్రాజెక్టుల కింద ప్రణాళికాబద్దంగా అమలు చేస్తే రైతులకు భరోసా వస్తుంది. ప్రభుత్వం అమలు చేయబోతున్న పక్కా విధానం తెలంగాణ రైతులకు మంచి ఏయడంతో పాటు దేశానికి ఆదర్శంగా నిలిస్తే మంచిదే.