సత్యం రాజుకు హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్,ఏప్రిల్30(జనంసాక్షి): సత్యం కంప్యూటర్స్ స్కాం కేసు లో నిందితులు రామ లింగరాజు తదితరు లకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. తమకు విధించిన శిక్షను సవా లు చేస్తూ వాళ్లు దాఖ లు చేసిన అప్పీలును విచారించేందుకు హైకోర్టు తిరస్కరించింది. నాంపల్లిలోని ఎంఎస్జే కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు తెలిపింది. దాంతో ఈ కేసులో దోషులుగా తేలిన వాళ్లంతా తొలుత నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులోనే తమ అప్పీలును దాఖలు చేయాల్సి ఉంటుంది. సత్యం కుంభకోణం కేసులో దోషులైన సత్యం రామలింగరాజు, రామరాజు తదితర నిందితుల పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది.నాంపల్లి సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు దోషులకు సూచించింది. 2009లో సత్యం కంపెనీకి సంబంధించిన కుంభకోణం బయటపడింది. అదే సంవత్సరం జనవరి 9న సీఐడీ రంగప్రవేశం… రామలింగరాజుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. విచారణకోసం సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా బీపీఎల్‌ఎన్ చక్రవర్తి నియామకంజరిగింది. సుమారు 33 నెలల జైలు జీవితం అనంతరం 2011 నవంబర్ 4 సత్యం రాజుకు సుప్రీం కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో మొత్తం 226 మందిని సీబీఐ విచారించింది. 14 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తేల్చింది. సత్యం రాజు, ఇతర దోషులు మొత్తం 2743 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించినట్లు నిర్దారించింది.