సత్వరం ప్రాజెక్టులు పూర్తి చేయండి

3
– హరీశ్‌ రావు

హైదరాబాద్‌ ,ఫిబ్రవరి 12(జనంసాక్షి): వచ్చే ఖరీఫ్‌లో సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని నీటి పారుదల శాఖ అధికారులకు ఆ శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ నీటి పారుదల శాఖపై మంత్రి హరీష్‌రావు సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ప్యాకేజీల వారీ పనుల పురోగతిపై చర్చించామని తెలిపారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల భూసేకరణలో ఇబ్బందులపై దృష్టి సారించామన్నారు. పనుల్లో గుత్తేదారులు, అధికారుల జాప్యంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల సత్వర పూర్తికి ఇచ్చిన జీవోలో కదలిక లేకపోవడంపై కోపోద్రిక్తులయ్యారు. జీవో 146 ప్రకారం ఈ నెల 20 లోగా గుత్తేదారులు ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపాదనలు ఇవ్వని గుత్తేదారులతో ఒప్పందాలు రద్దు చేయాలని ఆదేశించారు. భూసేకరణలో వస్తున్న సమస్యలపై హైకోర్టు సీజేతో చర్చించాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 20 తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టులను పరిశీలించాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాకు నీటి పారుదల కార్డు రూపొందించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.