సబ్‌ప్లాన్ వెంటనే అమలు చేయాలి
కరీంగర్‌లో ముగింపు సభతో సమస్యలను ఎండగతాం : చాడ
హైదరాబాద్,డిసెంబర్1(జనంసాక్షి): బిసిలు, మైనార్టీల కోసం సబ్‌ప్లాన్లు రూపొందించి చట్టాలు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి లేఖ రాశారు. బిసిలు, మైనార్టీలకు సబ్‌ప్లా న్ రూపొందిస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడిచినా,చట్టం చేయకపోవడం సరికాదన్నారు. ఎంబిసిలకు రూ. వెయ్యి కోట్లు కేటాయించి నెలలు గడుస్తున్నా ఎంబిసిలుగా ఏ కులాలను గుర్తించారో ప్రకటించలేదన్నారు. బిసి, ఎంబిసి, మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలన్నారు. అర్హులైన వారికి డబుల్‌బెడ్ ఇళ్లు కట్టించి ఇవ్వాలని, ఉపాధి హావిూ అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలావుంటే దేశంలో, రాష్ట్రంలో రైతులు పెద్దఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటుంటే పాలకులు మాత్రం సంబరాల్లో మునిగి తేలుతున్నారని చాడ విమర్శించారు. సామాజిక తెలంగాణ, సమాగ్రా భివృద్ధికి సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర ముగింపుసభ కరీంనగర్‌లో జరుగుతుందన్నారు. దీనికి బిజెపి, టిఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించామని అన్నారు. ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో కొత్త పరిశ్రమలు స్థాపించకపోగా ఉన్న పరిశ్రమలను మూసేయడం బాధాకరమనిచాడ వెంకట్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో నిజాం షుగర్స్ తెలిరించలేకపోయారని, కాగజ్‌నగర్ కాగిత పరిశ్రమ మూతపడ్డా అడ్డుకోలేకపోయారని అన్నారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. 100 రోజుల్లో ఎన్‌డీ ఎస్‌ఎల్ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేస్తామన్న సర్కార్ నేటికీ ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఫ్యాక్టరీ
మూసివేతతో అటు కార్మికులు ఇటు రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)కు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీజేఏసీ కొలువుల కొట్లాటకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక, నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. ప్రాజెక్టుల పేరిట రైతుల భూములను అప్పనంగా గుంజుకోవడం సరికాదన్నారు. మిషన్ కాకతీయ, భగీరథ పథకాలతో కాంట్రాక్టర్లకు వేలకోట్ల రూపాయలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ పథకాలు పూర్తిగా కవిూషన్ కాకతీయగా మారాయని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో దళితులు, మేధావివర్గంపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక తెలంగాణ, సమగ్రాభివృద్ధి కోసం వామపక్ష, ప్రజాతంత్ర వాదులందరితో కలిసి ఐక్య పోరాటాలు నిర్వహిస్తామన్నారు.