సభలో సమగ్ర చర్చ జరగాలి
` అక్టోబర్ 5 వరకు అసెంబ్లీ సమావేశాలు
` ఢల్లీి కాన్‌స్టిట్యూషనల్ క్లబ్ తరహాలో హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలకు క్లబ్ నిర్మాణం
` బీఏసీలో సీఎం కేసీఆర్ నిర్ణయం
` తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
` దివంగత సభ్యులకు నివాళి అర్పించిన సభ
` అనంతరం సోమావరానికి సభ వాయిదా
హైదరాబాద్,సెప్టెంబరు 24(జనంసాక్షి): హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలకు క్లబ్ నిర్మిస్తామని సిఎం కెసిఆర్ చెప్పారు. దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ తరహాలో దీన్ని నిర్మిస్తామన్నారు. ఢల్లీిలో ఎంపిలకు ఈ తరహా క్లబ్ ఎప్పటినుంచో ఉంది. దీని తరహాలో నిర్మించాలన్న సంకల్పాన్ని సిఎం కెసిఆర్ ప్రకటించారు. తెలంగాణ శాసనసభ వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో సిఎం ఈ ప్రతిపాదన చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. 8 పనిదినాల పాటు సమావేశాలు నిర్వహించాలని తెరాస ప్రభుత్వం స్పీకర్‌కు ప్రతిపాదిం చింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేల ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు చేరవేయాలి. అర్ధవంతమైన, ముఖ్యమైన అంశమైతే సమయం ఇవ్వాలి. కొత్తగా నిబంధనలు, విధివిధానాలు రూపొందించుకోవాలి. తెలంగాణ శాసనసభ దేశానికే ఆదర్శంగా నిలవాలి. సభ్యుల సంఖ్య తక్కువైనా విపక్షాలకు సమయం కేటాయిస్తు న్నామని కేసీఆర్ అన్నారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ చాలా అంశాలపై చర్చ చేపట్టాల్సి ఉందని.. 20 రోజుల పాటు అసెంబ్లీ జరపాలని కోరారు. ఈ మేరకు 12 అంశాలపై చర్చించాలని కోరుతూ స్పీకర్‌కు జాబితా అందజేశారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ అన్ని పక్షాల నుంచి జాబితా రావాలన్నారు. ఆ జాబితాలు వచ్చాక పనిదినాలు నిర్ణయిద్దామని చెప్పారు. అయితే ప్రాథమికంగా సమావేశాలను అక్టోబర్ 5వరకు నిర్వహించాలని స్పీకర్ నిర్ణయించినట్లు సమాచారం. ఇదిలావుంటే బీఏసీ సమావేశానికి ఆహ్వానం అందలేదని భాజపా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఏసీ సమావేశానికి తమకు ఆహ్వానం అందలేదని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ తెలిపారు. గడిచిన సారి ఇలాగే జరిగిందని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం లేకుండా బీఏసీ సమావేశం ఏర్పాటు చేయడం వారికే చెల్లిందని రాజాసింగ్, రఘునందన్ విమర్శించారు.
తెలంగాణ అసెంబ్లో సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజ బొజ్జి, ములుగు మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, బూర్గంపాడు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే ఎం సత్యనారాయణరావు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం, రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి, సుజాత నగర్ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్యకు శాసనసభ సంతాపం తెలిపింది. సంతాప తీర్మాణాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ సభ్యులందరూ నిబంధనలు పాటించాలని స్పీకర్ సూచించారు. సంతాపం ప్రకటించిన అనంతరం ఉభయ సభలు సోమవారానికి సోమవారానికి వాయిదాపడ్డాయి. ఉదయం 11 గంటలకు శాసన సభ, మండలి సమావేశమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. సంతాప తీర్మానాల అనంతరం శాసన సభ, మండలి సోమవారానికి వాయిదాపడ్డాయి.అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. ఈ మేరకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 5 వరకు జరగనున్నాయి. శాసన సభలోని స్పీకర్ చాంబర్‌లో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే నెల 5 వరకు సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈనెల 25, 26 (శని, ఆదివారాలు), అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 3 (ఆదివారం) తేదీల్లో సభకు సెలవు దినాలుగా ప్రకటించింది. మొత్తంగా ఏడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.