సమగ్రసర్వే దేశానికే ఆదర్శం
– 20న విస్త్రత స్థాయి సమావేశం
– సీఎం కేసీఆర్
హైదరాబాద్,ఆగష్టు 18(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే అత్యంత విప్లవాత్మకమైన కార్యక్రమమని, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని కేంద్ర గ్రావిూణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి (భూ వనరులు) హుకుమ్ సింగ్ అన్నారు. దీనికి కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని హావిూ ఇచ్చారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఆయన తన బృంద సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర భూ సర్వేపై చర్చించారు.రాష్ట్రంలో చేపట్టనున్న సమగ్ర భూ సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ అధికారులకు వివరించారు.”1932-36 మధ్య నిజాం హయాంలో భూ సర్వే జరిగింది. తర్వాత మళ్లీ ఎప్పుడూ సర్వే జరగలేదు. భూ వివరాలు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక అనర్థాలు, వివాదాలు జరుగుతున్నాయి. ఏ భూమి ఎవరి యాజమాన్యంలో ఉందనే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రతీ ఎకరానికి ఏడాదికి రూ.8వేల చొప్పున పెట్టుబడి అందించే కార్యక్రమం తీసుకుంది. రైతులకు పెట్టుబడి పథకం సరిగ్గా అమలు కావాలంటే, ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో తెలియాలి. కాబట్టే భూ సర్వే చేస్తున్నాం” అని చెప్పారు.”రాష్ట్రంలోని 10,875 రెవెన్యూ గ్రామాల పరిధిలో గ్రామం యూనిట్ గా ఈ సర్వే జరుగుతుంది. ఒక్కో గ్రామంలో నెల రోజుల పాటు అధికారులుండి రైతుల సహకారంతో భూ రికార్డులను అప్ డేట్ చేస్తారు. వాటిని ఆన్ లైన్ లో ఉంచుతారు. రికార్డులన్నీ సరిచేసిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలు ఇస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూడా సంస్కరణలు తెస్తున్నాం. పారదర్శకంగా ఉండే రిజిస్ట్రేషన్ విధానం తెస్తున్నాం. రిజిష్టర్ అయిన రోజే మ్యుటేషన్ చేసే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ఇవన్నీ పనులు జరగడానికి భూ వివరాలు సరిగ్గా ఉండడమే చాలా ముఖ్యం” అని సీఎం కేసీఆర్ అన్నారు.”తెలంగాణ ఏర్పడక ముందు ఏ వివరాలు సరిగ్గా ఉండేవి కాదు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన తర్వాత ప్రభుత్వానికి ఏది ఎలా ఉంది అనే విషయంలో అవగాహన వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడానికి నిర్దిష్ట ప్రాతిపదిక ఏర్పడింది. అలాగే ఇప్పుడు భూ సర్వే ద్వారా అటు రైతులకు పెట్టుబడి పథకం, ఇటు రిజిస్ట్రేషన్ల వ్యవహారం సక్రమంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. పెద్ద ఎత్తున చేపట్టే ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తరుఫున సహకారం కావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమం జరిగాక, దేశ వ్యాప్తంగా కూడా నిర్వహించడానికి ఇక్కడి అనుభవం పనికొస్తుంది. త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి కేంద్రానికి పంపుతాం” అని ముఖ్యమంత్రి చెప్పారు.దీనికి హుకుమ్ సింగ్ బదులిస్తూ, దేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి భూ సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత వల్ల ఇప్పుడు తెలంగాణలో ఈ సర్వే జరగడం సంతోషమన్నారు. సమగ్ర భూ సర్వే ఓ విప్లవమని, మిగతా రాష్ట్రాలకు ఆదర్శమని హుకుమ్ సింగ్ అన్నారు. ఈ పథకానికి కావాల్సిన ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తామని హావిూ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రాజెక్టు రిపోర్టు రాగానే కేంద్రం తరఫున అందించగలిగే ప్రతీ సహాయం అందిస్తామన్నారు.రాజకీయ సంకల్పంతో ప్రజలు, రైతుల భాగస్వామ్యం కూడా ఉన్నందున తెలంగాణలో ఈ కార్యక్రమం నూటికి నూరుశాతం విజయవంతమవుతుందని హుకుమ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులకు అనుగుణమైన సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహించాల్సి ఉంటుందని, ఈ విషయంలో కూడా తమ సహకారం ఉంటుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 25 ఏజన్సీలు కూడా సర్వే నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయని, వాటి సహకారం కూడా తీసుకోవచ్చని చెప్పారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిఆర్ విూనా, సిఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, కార్యదర్శి స్మిత సబర్వాల్, కేంద్ర ప్రభుత్వ గ్రావిూణాభివృద్ధి-భూ వనరుల విభాగం టెక్నికల్ డైరెక్టర్లు గౌతమ్ పొత్రు, దినేష్ కుమార్, డి.ఎస్. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.