సమస్యలకు నిలయంగా…. “పీఎంహెచ్-బి” గిరిజన హాస్టల్…
త్రాగునీరు లేక ఇక్కట్లు…
వార్డెన్ ఉన్నట్లా!??? లేనట్లా!??…
ఏటీడీఓ పర్యవేక్షణ లోపం?…
మరుగుదొడ్లు లేక బహిరంగ స్నానాలు…
కనీస సౌకర్యాలు కల్పించాలంటూ విద్యార్థులు వేడుకోలు….
జిల్లా గిరిజన అధికారి దృష్టి సారించేనా!?…
ఖమ్మం, (జనం సాక్షి): ప్రభుత్వం మారింది. తీరు మాత్రం మారలేదు. వార్డెన్లు, అధికారుల తీరు కూడా మారలేదు. ఫలితంగా ఖమ్మం పట్టణములో పోస్ట్ మెట్రిక్ గిరిజన వసతి గృహం (బి) లో విద్యార్థులు తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజన అభివృద్ధి శాఖ ఐటిడిఓ పిఓ దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని పలు విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న పోస్ట్ మెట్రిక్ కళాశాల బాలుర వసతిగృహం(పిఎంహెచ్)-‘బి’ లో కనీస సౌకర్యాలు లేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు హాస్టల్లో బస చేస్తున్న విద్యార్థులు వాపోతున్నారు. ఖమ్మం పట్టణంలోని నూతన బస్టాండ్ కి కూత వేటు దూరంలో ఉన్న ఈ హాస్టల్లో సుమారు 200 మందికి పైగా కళాశాల విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న హాస్టల్ వార్డెన్ సక్రమంగా విధులకు హాజరు అవ్వట్లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఈ పోస్ట్ మెట్రిక్ కళాశాల గిరిజన వసతి గృహము-‘బి’ హాస్టల్ ను ఇటీవల కాలంలోనే నిర్మించినప్పటికీ, మరుగుదొడ్లలో కనీసం నీళ్లు రాక, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థులు స్నానాలు చేయడానికి బాత్రూమ్స్ లేక ఆరు బయటనే స్నానాలు చేస్తున్నారు. ఉన్న మరుగు దొడ్లు నిరుపయోగంగా మారాయి. తాగడానికి కనీసం మంచినీళ్లు లేక మున్సిపాలిటీ నీళ్లతో సరిపెట్టుకుంటున్నారు. అయితే ఈ నీళ్లు తాగడానికి విద్యార్థులు అంతగా ఇష్టపడడం లేదు. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.
* కనిపించని ఏటిడివో తనిఖీలు….?
హాస్టల్ వార్డెన్ల పనితీరును పర్యవేక్షించి, సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకపోవాల్సిన అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ఇటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ పనిచేసే హాస్టల్ వార్డెన్ సమయపాలన పాటించకుండా తమ వ్యక్తిగత పనులను చక్కబెట్టుకుంటున్నట్లు పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి పోస్ట్ మెట్రిక్ గిరిజన కళాశాల వసతి గృహం (బి) లో సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు కోరుకుంటున్నారు.
* వసతి గృహ విద్యార్థుల వాయస్ :
1. వసతి గృహ విద్యార్థి: వీరభద్రం, బీఫార్మసీ ఫైనల్ ఇయర్. పులిపాటి ప్రసాద్ ఫార్మసీ కాలేజ్.
హాస్టల్లో మరుగుదొడ్లు నిర్మించారు కానీ కనీసం నీళ్ల వచ్చేందుకు నల్లాలు ఏర్పాటు చేయలేదు. దీంతోనీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. బకెట్లతో నీళ్లు తెచ్చుకొని ఆరుబయటే స్నానాలు చేస్తున్నాము. ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం.
__________
2. వసతి గృహ విద్యార్థి: గడ్డం అనిల్, బికాం సెకండ్ ఇయర్. ఎస్ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల.
హాస్టల్లో కనీసం మంచినీటి సౌకర్యం లేక 250 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నాం. మున్సిపాలిటీ వాటర్ లో విపరీతమైన మురుగు పేరుకుంటుంది. ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్యని పరిష్కరించాలి.
* ప్రతి సమస్యను ఉన్నతాధికారులకు విన్నవించా.. సత్యవతి, ఏటీడీఓ
కళాశాల బాలుర వసతిగృహం (బి) లో ఉన్న సమస్యలు నా దృష్టికి వచ్చాయి. పలుమార్లు వసగృహాన్ని తనిఖీ చేశాను. నేను సక్రమంగా వసతిగృహానికి వెళ్లలేదు అనే మాట సత్య దూరం. మరుగుదొడ్ల అంశాన్ని ఇంజనీరింగ్ విభాగానికి విన్నవించాను.