సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా
నిజామాబాద్, అక్టోబర్ 29 : ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ నవాబ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, ఆర్మూర్ డివిజన్‌లలో ఆటోడ్రైవర్లు దాదాపుగా 20 వేల మంది ఉన్నారని అన్నారు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుకోని జీవిస్తున్నామని తెలిపారు. ఆటోలు కొనుగోలు చేయడానికి అధిక వడ్డీకి ఫైనాన్స్‌ల ద్వారా ఆటోలను కొనుగోలు చేసి జీవనం కొనసాగిస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లాలోనే ఆటోలను జాతీయ రహదారిపై నడిపేందుకు అనుమతించకపోవడం, పైగా నడిపితే సీజ్ చేయడం జరుగుతుందన్నారు. పోలీసుశాఖ 16 అక్టోబర్‌న జాతీయ రహదారిపై ఆటోలు నిషేదం అని హెచ్చరించడంతో కామారెడ్డి, ఆర్మూర్ డివిజన్‌లోని ఆటోడ్రైవర్లు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆటోడ్రైవర్లపై ఆర్‌టిఏ, పోలీసుశాఖ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా హైవేపై ఆటోలను నడిపిస్తే కాల్చివేత అన్నట్లు ఆటోలను సీజ్ చేస్తామని చెప్పడం, మా బతుకులను బుగ్గిపాలు చేస్తామనడమేనని అన్నారు. అనంతరం కలెక్టర్‌ని కలిసి వినతిపత్రం అందించారు. కలెక్టర్‌ని కలిసిన వారిలో సాయాగౌడ్, నన్నుఖాన్, రవి, తదితరులున్నారు.