సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ముందు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ ఎం.వెంకటి మాట్లాడుతూ జి.పి కార్మికులందరికి ప్రావిడెంట్‌ ఫండ్‌ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు జరపాలని, జాతీయ ఉపాధి హమీ పథకాన్ని  కార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులందరూ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాడాలని కార్మికులకు పిలుపునిచ్చారు.ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య మాట్లాడుతూ జి.పి కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉండే విధంగా చూసే కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లుతెరచి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి ఎన్‌.దాసు మాట్లాడుతూ జిపి కార్మికులు 20,30 సంవత్సరాల నుండి పని చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదని, కార్మికులకు పిఎఫ్‌, ఈఎస్‌ఐలను వర్తింపజేయడం లేదని, కార్మికులకు అతి తక్కువ వేతనాలను చెల్లిస్తూ ప్రభుత్వం వెట్టి చేయించుకుంటుందని, కార్మికులను రెగ్యులరైజ్‌ చేయడం లేదన్నారు.  జి.పి వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాజామొయినుద్దీన్‌ మాట్లాడుతూ జిపి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి కార్మికులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని, పిఎఫ్‌,ఈఎస్‌ఐ ప్రభుత్వ జాతీయ ఉపాధి హమీ పథకాన్ని కార్మికులకు వర్తింపజేయాలని, కార్మికుల డిమాండ్లు సాధించుకునే వరకు కార్మికులు పోరాడాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భీమ్‌గల్‌, కమ్మర్‌పల్లి, సిరికొండ, ధర్పల్లి, డిచ్‌పల్లి, ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి తదితర మండలాల కార్మికులు  గంగాధర్‌, నారాయణ, బషీర్‌, మల్లేష్‌, రాజేశ్వర్‌, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు