సమస్యలే ఎజెండాగా ఉమ్మడి ఉద్యమాలు
దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై జాతీయ స్థాయి ఉద్యమం చేయడానికి లెఫ్ట్ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలతో పాటు, దాని అనుబంధ సంస్థలు,కార్మిక సంఘాలు వివిధరూపాల్లో పోరాటాలు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అవి సమస్యలను ఆధారం చేసుకుని ఉద్యమిస్తున్నాయి. ఈ దశలో ఇక ఉమ్మడిగా పోరు చేయడానికి అన్ని పార్టీలను కలుపుకుని పోవడానికి సిద్దం అవుతున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల కారణంగా కొంత వెనకడుగు తప్పడం లేదు. బెంగాల్లో మమతపై పోరాటం చేస్తున్న లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్‌తో కలసి పోలేక పోతున్నాయి. కేరళలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. అయితే స్థూలంగా స్థానిక సమస్యలపై పోరాటాలు చేసేలా ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోబోతున్నారు. ఇవన్నీ కూడా బిజెపికి కలసివచ్చేలా ఉన్నాయి. ఆయా పార్టీల్లో ఉన్న అనైతక్యతను క్యాష్ చేసుకోవాలని బిజెపి ఊస్తోంది. అయితే సమస్యల ఆధారంగా పోరాడాలని వివిధ పార్టీల అనుబంధ సంఘాలు నిశ్చయించాయి. ప్రధానంగా రైతాంగ, కార్మిక సమస్యలపై లెఫ్ట్ అనుబంద సంస్థలు ఉద్యమించబోతున్నాయి. ఇటీవల ఉత్తరాదిలో పది రాష్ట్రాల్లో రైతులు ఆందోళనకు దిగి కేంద్రానికి ముచ్చెమటలు పట్టించారు. గతంలో తమిళనాడు రైతులు కూడా ఢిల్లీ వేదికగా ఆందోళను దిగారు. అయితే రైతుల సమస్యలు పరిష్కరిం చడంలో కేంద్రం విఫలమయ్యింది. దీనిని ఆసరగా చేసుకుని రైతులను కలుపుకుని ఉద్యమించేందుకు రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నాయి. మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో అన్ని రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులను సవిూకరించేందుకు ఉద్యుక్తులు అవుతున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 5న సిఐటియు, ఎఐకెఎస్, ఎఐఎడబ్ల్యుయు సంఘాల నేతృత్వంలో నాలుగు లక్షల మందితో మజ్దూర్ కిసాన్ సంఘర్ష ర్యాలీ(పార్లమెంట్ మార్చ్) నిర్వహిస్తామని ఎఐకెఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా వెల్లడించారు. అన్ని రాష్టాల్లోన్రూ, జిల్లాల్లోనూ సన్నాహక సభలు నిర్వహిస్తామని, మజ్దూర్ కిసాన్ సంఘర్ష ర్యాలీ ప్రాధాన్యతను వివరిస్తామని పేర్కొన్నారు. మోడీ నాలుగేళ్ల పాలనలో దేశంలోని సామాన్య ప్రజల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితి దిగజారిందని విమర్శించారు. దేశంలో 50 శాతంపైబడి ప్రజానీకం వ్యవసాయంపై ఆధారపడుతున్నారని, అలాంటి వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడిందని ద్వజమెత్తారు. 2002 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని ప్రధాని మోడీ ప్రగ్భాలు పలుకుతున్నాడని, కానీ మరోపక్క గత ఏడాదిన్నరలో గ్రావిూణ ప్రాంతాల వారి ఆదాయం తగ్గిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నా యని గుర్తు చేశారు. దేశంలో 42 శాతం రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను బిజెపి ప్రభుత్వం మరింత దూకుడుగా అమలు చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. దేశంలో రైతుల వద్ద భూములను బలవంతంగా లాక్కొంటున్నారని విమర్శించారు. నరేగా కేటాయింపులను 50శాతం తగ్గించారని, ఫలితంగా 20 రోజుల మాత్రమే పని ఉంటుందని అన్నారు. దేశంలోని 80 శాతం కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికులున్నారని, బిజెపి వారిపై దాడి చేస్తోందని విమర్శించారు. రైతులు, కార్మికులు సమస్యలతో సతమతమవుతున్నారని, నాలుగేళ్ల మోడీ పాలన అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులపై దాడి కొనసాగుతోందని, ప్రజలను కుల, మత ప్రాతిపదికన విభజిస్తున్నారని దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గతంలో సిఐటియు మూడురోజులు మహా పడవ్, ఎఐకెఎస్ రెండు రోజుల పాటు కిసాన్ సంసద్, వ్యవసాయ కార్మిక సంఘం భారీ పార్లమెంట్ మార్చ్‌ను నిర్వహించాయని, ఇప్పుడు మూడు సంఘాలు సంయుక్త ఉద్యమానికి నిర్ణయించా యని తెలిపారు. 15న ప్రజా, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక డిమాండ్లతో పార్లమెంట్ మార్చ్ జరుగుతుందని చెప్పారు. రైతుల సమస్యలపై కిసాన్ సభ దేశవ్యాప్తంగా పది కోట్ల సంతకాలు సేకరించిందని, జిల్లా కలెకర్టర్లకు ఆ సంతకాలను అందజేస్తామని చెప్పారు. ఆగస్టు 9న కిసాన్ సభ జైల్‌భరో నిర్వహిస్తోందని, దాదాపు 300 జిల్లాల్లో ఈ ఆందోళన జరుగుతుందని పేర్కొన్నారు. కిసాన్ సభ జైల్‌భరోకు సిఐటియు మద్దతిచ్చిందని, ఆందోళనలో కూడా సిఐటియు ప్రత్యక్ష భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. దేశం మొత్తంగా తిరోగమనంలో వుందని, అన్ని రంగాలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగం పెరిగిందని, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని తెలిపారు. విద్యా, వైద్యం, ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ చూశామని, కానీ ఇప్పుడు ప్రభుత్వ పాలనను కూడా ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ సర్కార్ సన్నద్ధమౌతోందని ధ్వజమెత్తారు. కార్పొరేట్ శక్తులను ప్రభుత్వ పాలనలోకి తీసుకొచ్చేందుకు మోడీ తహతహలాడుతున్నారని విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా నినాదంలో పస లేదని, ఉన్న పరిశ్రమలే మూత పడుతున్నాయని అన్నారు. మొత్తంగా దేశంలో ప్రజలందరూ సమస్యలను ఎదుర్కొంటున్నారని, సమస్యలను పరిష్కరించడంలో మోడీ సర్కార్ విఫలం అయ్యిందని గుర్తించారు. ఈ మేరకు దగాపడ్డ వర్గాలను కలుపుకుని ఉద్యమించేందుకు ఉద్యుక్తులు అవుతున్నారు. ఆయా రంగాల్లో ఉన్న వారిని గుర్తించి సమస్యలపై జాతీయస్థాయి పోరాటాలు ఉధృతం చేయనున్నారు. ఇందుకు రాజకీయ పార్టీలను కూడా కలపుకుని పోనున్నారు.