సమస్యల పరిష్కారానికి కృషి

నిజామాబాద్‌, నవంబర్‌ 1: జిల్లా సర్వతోముఖాభివృద్ధికి, పేదల సంక్షేమానికి, మాతా శిశు మరణాల రేటు తగ్గించడానికి, ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి విశేషంగా కృషి చేస్తున్నాయని, రైతులకు లబ్ధి చేకూర్చడానికి పలు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌. చొంగ్తు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా అధికంగా గ్రామీణ ప్రాంతమైనందున రైతులకు ఈ ఖరీఫ్‌లో 833 కోట్ల రూపాయలు పంట రుణాలు అందించడంతో పాటు రబీలో 677.20 కోట్లు రుణాలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో మూడు లక్షలకు పైగా హెక్టార్లలో వరి, మొక్కజొన్న, సోయాబీన్‌, పసుపు తదితర పంటలను సాగుచేశామని, వీటికి మద్దతు ధర ఇప్పించడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని, వరి ధాన్యం కొనుగోలుకు సుమారు 200 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి, సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  డిఐజి సంజయ్‌, సంయుక్త కలెక్టర్‌ హర్షవర్దన్‌, డిఆర్‌ఓ జగదీశ్వరాచారి, అదనపు ఎస్పీ పద్మజ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు