సమస్యల సుడిగుండంలో ప్రజలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26  : కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు, అటు వ్యాపారస్తులకు ,కార్మికులకు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ అన్నారు.శుక్రవారం  స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా వంట గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేయడంతో వల్ల చిన్నకుటుంబాలతో పాటు అంగన్‌వాడీ ఉద్యోగులు సైతం తీరని సమస్య ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.  సంవత్సరానికి అంగన్‌వాడీ కేంద్రాలకు  60 సిలిండర్లు కావాల్సి ఉండగా ప్రభుత్వం మాత్రం సంవత్సరానికి ఆరు సిలిండర్లే ఇవ్వడం వల్ల అంగన్‌వాడీ కేంద్రాలు నడపాలంటేనే కష్టంగా మారిందన్నారు.  ఇప్పటికే అంగన్‌వాడీ ఉద్యోగులకు కనీస వేతనాలే ఇవ్వడంలో ప్రభుత్వం వెనుకంజ వేస్తుందని, దీనికి తోడు వంట గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేయడంతో ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మహిళలు, అసంఘటిత కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. కొందరు వ్యాపారస్తులు 5వందల నుండి వేయి రూపాయల వరకు చాలీచాలని వేతనాలు చెల్లిస్తూ వారిని శ్రమ దోపిడి చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా వారికి కనీస వేతనాలు అమలు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. నవంబర్‌ 26,27వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వ  శాఖలో పని చేసే ఉద్యోగుల చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆమె పేర్కొంది.సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ, యూటిఎఫ్‌లు ఈ చలో డిల్లీ కార్యక్రమంలో పాల్గొంటాయని ఆమె తెలిపింది.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌బాబు, నగర కార్యదర్శి గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు